సప్తపది, ఆచారాలు లేని హిందూ పెళ్లిళ్లు చెల్లవు.. సంచలన తీర్పులకు అలహాబాద్ హైకోర్టు కేరాఫ్..!

0
414

దేశంలో న్యాయస్థానాలు సంచలనాలకు కేరాఫ్ గా మారుతున్నాయి. కీలక తీర్పులు ఇస్తూ చర్చనీయంగా మారుతున్నాయి. కింది కోర్టులతో పాటు అత్యున్నత న్యాయస్థానాలు కూడా సంచలన తీర్పులు ఇస్తున్నాయి. అందులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ హైకోర్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తాజాగా ఆ హైకోర్టు మరో కీలక తీర్పును ఇచ్చింది. భారతదేశంలో హిందువుల పెళ్లిళ్లంటేనే ఆచారాలు,సంప్రదాయాలు. అవేవీ లేకుండా సాదాసీదాగా జరిగే పెళ్లిళ్ల సంఖ్య కూడా తక్కువేమీ లేదు. కానీ ఆచారాలు లేకుండా ఇలా జరిగే పెళ్లిళ్లు అసలు చెల్లవని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. దీంతో ఇకపై ఇలాంటి పెళ్లిళ్లపై వచ్చే కేసులకు ఈ ఆదేశాలు ప్రామాణికం కానున్నాయి. ఆచారాలు లేకుండా జరిగిన ఓ పెళ్లికి సంబంధించి దాఖలైన పిటిషన్ పై హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

సప్తపది వేడుకతో పాటు ఇతర ఆచారాలు లేకుండా హిందూ వివాహం చెల్లుబాటు కాదని అలహాబాద్ హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పులో ప్రకటించింది. విడాకులు తీసుకోకుండానే విడిపోయిన తన భార్య రెండవ వివాహం చేసుకుందని ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఆ పెళ్లిని రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్.. పెళ్లి అనే పదానికి సరైన వేడుకలతో, సరైన రూపంలో వివాహాన్ని జరుపుకోవడం అని అర్థం వస్తుందని తెలిపారు. అలా జరగకపోతే మాత్రం దాన్ని పెళ్లి అనలేమన్నారు. పెళ్లి అనేది చెల్లుబాటు అయ్యే వివాహం కాకపోతే, పార్టీలకు వర్తించే చట్టం ప్రకారం, చట్టం దృష్టిలో అది వివాహం కాదని హైకోర్టు తెలిపింది. హిందూ చట్టం ప్రకారం ‘సప్తపది’ వేడుక పెళ్లిని చెల్లుబాటుగా గుర్తించేందుకు అవసరమైన కార్యాల్లో ఒకటిగా పేర్కొన్నారు.

కానీ ఈ పెళ్లిలో అలాంటి వేడుక జరగనట్లు హైకోర్టు గుర్తించింది. కాబ్టటి ఈ పెళ్లి చెల్లుబాటు కాదని ప్రకటించింది. 1955 నాటి వివాహ చట్టంలో ఇలాంటి వేడుకలు, ఆచారాలు జరిగితేనే పెళ్లిగా దాన్ని గుర్తిస్తారని తెలిపింది. 2017లో పిటిషనర్ స్మృతి సింగ్ కు సత్యం సింగ్‌తో ఘనంగా పెళ్లి జరిగింది. అయితే వివాహేతర సంబంధాల కారణంగా ఆమె అత్తమామల ఇంటిని విడిచిపెట్టి, కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. విచారణ అనంతరం పోలీసులు ఛార్జిషీటు సమర్పించారు. ఆ తర్వాత ఆమె రెండో పెళ్లి చేసుకుందని సత్యం సింగ్ ఆరోపించాడు. దీన్ని స్ధానిక కోర్టు గుర్తించడంతో హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన హైకోర్టు దాన్ని రద్దు చేసింది.

గతనెలలోనూ అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. లివ్-ఇన్ రిలేషన్స్‌పై అలహాబాద్ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. భారతీయ వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి ఇదో ఒక క్రమబద్ధమైన రూపకల్పన అని చెప్పింది. సహజీవన భాగస్వామిపై అత్యాచారం చేసిన నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వివాహ వ్యవస్థ వ్యక్తికి అందించే భద్రత, సామాజిక ఆమోదం, స్థిరత్వం.. లివ్-ఇన్-రిలేషన్‌షిప్‌లో ఇది ఉండదని జస్టిస్ సిద్దార్థ్‌ ధర్మాసనం చెప్పింది. ప్రతిసారీ భాగస్వాములను మార్చడం అనే క్రూరమైన భావన అని.. స్థిరమైన, ఆరోగ్యకరమైన సమాజానికి ముఖ్య లక్షణంగా పరిగణింపబడదని స్పష్టం చేసింది.

దేశంలో మధ్యతరగతి నైతికతను విస్మరించలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ దేశంలో వివాహ వ్యవస్థను పాతబడిందిగా భావిస్తూ లివ్-ఇన్-రిలేషన్‌షిప్ సాధారణమైనదిగా పరిగణిస్తున్నారని.. అభివృద్ధి చెందిన దేశాలు అని పిలవబడే అనేక దేశాలలో వివాహ వ్యవస్థను రక్షించడం వారికి పెద్ద సమస్యగా మారిందని హైకోర్టు అభిప్రాయపడింది. దేశంలో ఇదే విధమైన ధోరణితో భవిష్యత్తులో తమకు పెద్ద సమస్యను సృష్టించడానికి ముందుకు వెళ్తున్నామని హైకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది.

వివాహ బంధంపై భాగస్వామికి అవిశ్వాసం అని… సహజీవనంలో స్వేచ్ఛగా జీవించడం ప్రగతిశీల సమాజానికి చిహ్నాలుగా భావిస్తున్నారని అభిప్రాయపడింది. యువత అటువంటి ధోరణికి ఆకర్షితులతూ దీర్ఘకాలిక పరిణామాల గురించి పట్టించుకోవడం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఉత్తర్ ప్రదేశ్‌‌లోని షహనారాన్‌పూర్‌కు చెందిన అద్నాన్ అనే యువకుడు.. 19 ఏళ్ల యువతి ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇష్టం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుంటానని ఆమెకు మాటిచ్చాడు. ఏడాది పాటు సహజీవనంలో ఉండగా.. యువతి గర్బం దాల్చింది. ఈ క్రమంలో అద్నాన్ ఆమెను పెళ్లిచేసుకోవడానికి నిరాకరించాడు. దీంతో ఆ యువతి ఈ ఏడాది ఏప్రిల్‌లో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మాటతప్పాడని ఆరోపించింది. తప్పుడు వాగ్దానంతో కోరికను తీర్చుకున్నాడని పేర్కొంది. యువతి ఫిర్యాదు ఆధారంగా అతడిపై పోలీసులు అత్యాచారం కేసు నమోదుచేసి.. అద్నాన్‌ను అరెస్ట్ చేశారు. దీంతో నిందితుడు బెయిల్ పిటిషన్‌ను కింది కోర్టు తిరస్కరించగా.. అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సిద్ధార్థ్ ధర్మాసనం.. సహజీవనాలపై అసహనం వ్యక్తం చేసింది. భారతీయ వివాహ వ్యవస్థకు గుదిబండగా మారుతోందని అభిప్రాయపడింది.

ఇక ఆగస్ట్ నెలలోనూ ఇదే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పద్దెనిమిదేళ్ల లోపువారు సహజీవనం చేయడం అనుమతించదగ్గ విషయం కాదని.. అది అనైతికమే కాక చట్టవిరుద్ధం కూడా అని అలహాబాద్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది. సహజీవనాన్ని వివాహంతో సమానమైన సంబంధంగా పరిగణించేందుకు పలు షరతులు ఉన్నాయని స్పష్టం చేసింది. సహజీవనం చేయాలంటే.. ఒక వ్యక్తికి పెళ్లి వయసు లేకున్నా కనీసం మేజర్‌ అయి ఉండాలని తేల్చిచెప్పింది. యూపీకి చెందిన 19 ఏళ్ల యువతి దాఖలు చేసిన క్రిమినల్‌ రిట్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా అలహాబాద్‌ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 27వ తేదీన ఆ యువతి ఇంటి నుంచి వెళ్లిపోయి 17 ఏళ్ల యువకుడితో ప్రయాగరాజ్‌లో సహజీవనం చేస్తోంది. ఏప్రిల్‌ 30న ఆమె తల్లిదండ్రులు ఆ యువకుడిపై అపహరణ కేసు పెట్టారు.

పోలీసులు ఆ అబ్బాయిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 363, 366 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అనంతరం అమ్మాయి తల్లిదండ్రులు.. సహజీవనం చేస్తున్న వారిద్దరినీ పట్టుకుని తమ గ్రామానికి తీసుకెళ్లారు. రెండురోజుల తర్వాత ఆ యువతి తన ఇంట్లోంచి కష్టమ్మీద బయటకు వచ్చి యువకుడి తండ్రిని కలిసి మొత్తం విషయం చెప్పింది. ఇష్టపూర్వకంగానే తాను ఆ అబ్బాయితో కలిసి ఉంటున్నానని.. కాబట్టి అతడిపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని, అతడిని అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం ఆమె విజ్ఞప్తిని తిరస్కరించింది. మైనర్ అయిన అమ్మాయితో సహజీవనం చేస్తున్నాననే కారణంతో ఆ అబ్బాయి నేరవిచారణ నుంచి రక్షణ కోరలేడని, అతడి చర్యలు చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఈ కేసులో బాలుడు ముస్లిం అని.. ముస్లిం లా ప్రకారం ఆ అమ్మాయితో అతడి సంబంధం ‘జినా కిందికి వస్తుందని, కాబట్టి అనుమతించదగ్గది కాదని తేల్చిచెప్పింది. అసలు 18 ఏళ్లలోపువారిని పిల్లలుగా పరిగణించాలని చెప్పింది.

సహజీవనాన్ని నిషేధించే చట్టమేదీ లేదని.. కానీ ప్రస్తుత కేసులో రెండో పిటిషనర్‌ ఒక బాలుడని చెప్పింది. ఒక బాలుడిగా అతడు ఇలాంటి సంబంధం కలిగి ఉండడాన్ని ఒప్పుకోకూడదని వ్యాఖ్యానించింది. ఒకవేళ.. దీన్ని అనుమతిస్తే చట్టవిరుద్ధమైన చర్యకు అనుమతించినట్టే అవుతుందని, అది సమాజానికీ మంచిది కాదని వ్యాఖ్యానించింది. చట్టపరంగా ఎంతమాత్రం అనుమతించదగ్గవి కావని ఇలాంటి చర్యలను ఆమోదించడానికి తాము సిద్ధంగా లేమని తేల్చిచెబుతూ ఆ యువతి వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఆ బాలుడిపై పెట్టిన అపహరణ కేసు విషయానికి వస్తే.. వారిద్దరూ సహజీవనంలో ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ, అతడు ఆమెను మోసపూరిత విధానాల్లో ప్రలోభపెట్టి ఇంటి నుంచి తీసుకెళ్లాడా లేదా అనే విషయంపై మాత్రం దర్యాప్తు జరపాలని ధర్మాసనం అభిప్రాయపడింది. అలాగే ఈ కేసులో సెక్షన్‌ 161, 164 సీఆర్పీసీ కింద బాలుడి వాంగ్మూలాన్ని నమోదు చేయని విషయాన్ని కూడా అలహాబాద్ హైకోర్టు గుర్తుచేసింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

16 − 8 =