బలవంతంగా మతం మార్చి.. మహిళ ఇంట్లోకి దూరి.. పాక్ హిందువులపై ఆగని దాడులు

0
781

ఉగ్రవాద పాకిస్థాన్‎లో హిందువులు దయనీయంగా బతుకుతున్నారు. దేశంలో మైనార్టీలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని.. పాకిస్థాన్ సర్కార్ చెబుతున్న మాటలు అవాస్తవాలని మరోసారి తేటతెల్లమైంది. పాక్ సర్కారు డొల్లతనం వల్ల ఆ దేశంలో హిందువులపై హింసాకాండ యధేచ్ఛగా కొనసాగుతోంది. పాక్ లో ఇటీవల వరుస నేరాలు, ఘోరాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా.. ఓ హిందూ వ్యక్తిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. కొందరు పాక్ దుండగులు హిందూ మహిళను దారుణంగా కొట్టి అత్యాచారానికి పాల్పడ్డారు.

పాకిస్థాన్ లాహిండే పంజాబ్ బహవల్ పూర్ లో హిందు మహిళ వ్యవసాయ కూలీగా పనిచేస్తోంది. ఈ క్రమంలో యజమాని మహ్మద్ అక్రమ్ నుంచి వేతనాలు తీసుకోవడానికి వెళ్లింది. అయితే, చేసిన పనికి వేతనం అడగడమే ఆమె చేసిన మహాపాపమైంది. అక్రమ్.. ఆమెకు వేతనం ఇవ్వకపోగా అకారణంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా మరుసటి రోజు అక్రమ్, తన అనుచరులతో కలిసి ఆమె ఇంట్లోకి చొరబడి.. ఆమె కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేశాడు. అక్రమ్ తో సహా ఆ దుష్ట గ్యాంగ్ ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడింది. ఈ దారుణం గురించి పన్నెత్తి మాట్లాడినా, వేలెత్తి చూపినా, పోలీసులకు తెలిపినా.. అందర్నీ హతమారుస్తామని అక్రమ్ బెదిరిస్తున్నారని బాధిత కుటుంబీకులు వాపోయారు.

దారుణాలు, దాష్టీకాలు భరిస్తూ.. భయం భయంగా బాధిత కుటుంబీకులు బహవల్ పూర్ సిటీ పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదు చేశారు. అయితే, సంఘంలో పెద్ద మనిషిగా వున్న అక్రమ్‎పై ఫిర్యాదు చేసి, కష్టాలు తెచ్చుకోవద్దని, ఆయనకు బలమైన రాజకీయ సంబంధాలు వున్నాయని, ఎందరో సీనియర్ అధికారులు తెలుసని సిటీ పోలీసులు తెలియజేసి, తమ ఫిర్యాదును తిరస్కరించారని బాధితులు చెప్పారు.

దేశంలోని హిందువులు, ఇతర మైనార్టీల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని పాక్ ప్రభుత్వం పాత పాటే పాడుతోంది. అంతే తప్ప ఆచరణలో మాత్రం అడుగు ముందుకు వేయడం లేదు. పాక్ లో హిందూ సమాజంపై రాడికల్స్, భూస్వాములు చేస్తున్న దాడులు అన్నీ ఇన్ని కావు. దిన దిన గడం, క్షణ మొక యుగంగా పాక్ లో భారతీయులు భారంగా రోజులు గడుపుతున్నారు.

పాక్ లో హిందువులపై జరిగే దారుణాలు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కిడ్నాప్ ను ప్రతిఘటించిందని ముక్కుపచ్చలారని టీనేజ్ బాలికను దుండగులు కాల్చి చంపేశారు. ఈ ఏడాది మార్చిలో సింధ్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. సింధ్ జిల్లా సుక్కూర్‌ రోహిలో పూజా ఓడ్ అనే 18 ఏళ్ల బాలికను అపహరించడానికి కొందరు పాక్ ముష్కరులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఆమె కేకలు వేసి, ప్రతిఘటించడానికి ప్రయత్నించింది. దీంతో, ఆ ముష్కర గ్యాంగ్..ఆమెపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి ప్రాణాలు తీసేసింది.

ఇస్లామిక్ దేశం పాకిస్థాన్ లో హిందువులు, మైనార్టీలు తరచూ కిడ్నాప్‎లు, లైంగిక వేధింపులు, బలవంతపు వివాహాలు, కాల్పులకు గురవుతున్నారు. పీపుల్స్ కమిషన్ ఫర్ మైనారిటీస్ రైట్స్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్ ప్రకారం, 2013, 2019 సంవత్సరాల మధ్య 156 బలవంతపు మతమార్పిడుల కేసులు నమోదయ్యాయి. ఇదేకాక హిందువులపై లెక్క లేనన్ని దారుణకృత్యాలు, దాష్టీకాలు జరిగాయి.

తాజాగా సింధ్‌లో ఓ హిందూ వ్యక్తిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చినట్టు మీడియా కథనం ద్వారా తెలిసింది. జమియాత్ ఉలామా-ఎ-సింద్ ప్రధాన కార్యదర్శి మౌలానా రషీద్ మహమూద్ సూమ్రో ఆధ్వర్యంలో పాక్ లోని లర్కానా సింధ్‌ జామియా ఇస్లామియా మసీదు వద్ద బలవంతంగా ఇస్లాంలోకి మార్చినట్టు మీడియా వెల్లడించింది.

అంతకు ముందు 2021 ఆగస్టు నెలలో బహవల్‌పూర్‌లో యజ్మాన్ సిటీ నుంచి అనిత అనే యువతిని మహమ్మద్ వసీం అనే ముస్లిం వ్యక్తి బలవంతంగా అపహరించాడు. ఆమె బొటన వేలి ముద్రను తీసుకుని బలవంతంగా ఇస్లాంలోకి మార్చాడని నాడు వార్తలు వచ్చాయి. తనను భర్తగా అంగీకరించాలని ఆమెపై ఒత్తిడి తెచ్చి చిత్రహింసలకు గురిచేశాడని ఆ కధనాలు వివరించాయి. బాధితురాలిని తాళం వేసి ఉన్న గదిలో బంధించాడాని, పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మీడియా కథనాలు తెలిపాయి. ఏడాది పాటు హింస భరించిన ఆమె..అనంతరం ఏదోలా తప్పించుకుని బహవల్‌పూర్‌ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసింది. బలవంతపు వివాహపు చెర నుంచి తనను కాపాడాలని ఆమె వేడుకుంది.

పాక్‎లో ముస్టిం మెజార్టీ వివక్షాపూరిత వైఖరికి.. అక్కడ నివసిస్తున్న హిందువులు ఎన్నో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇలా వివక్షకు గురవుతున్నవారిలో మహిళా అధికారులు, రాజకీయ నేతలు, మతపర పార్టీల నేతలు ఎక్కువగా వుంటున్నారు. మతపర మైనారిటీ మహిళలు, బాలికలు తరచూ కిడ్నాప్ చేయబడుతున్నారని, బలవంతపు మత మార్పిడికి గురవుతున్నారని, నిర్బంధపు వివాహాలకు బలవుతున్నారని I.F.F.R.A.S నివేదించింది. చట్టపరమైన మార్గాలను ఉపయోగించి ఈ నేరాలను సవాలు చేయడానికి వారి కుటుంబాలు విఫలమవుతున్నాయని I.F.F.R.A.S తెలిపింది.

పాకిస్తాన్‌లోని మతపరమైన మైనారిటీల దుస్థితిని మానవ హక్కుల సంఘాలు ఎన్నోమార్లు డాక్యుమెంట్ చేశాయి. హిందూ బాలికల ఇష్టానికి వ్యతిరేకంగా..పెద్ద వయస్సున్న ముస్లింలతో బలవంతపు వివాహాలు జరగడం సైతం ఇక్కడ ఎక్కువగా వుంటోందని I.F.F.R.A.S తెలియజేసింది.

2021 మొదట్లో దేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌లో దాదాపు ఏడు వేల మంది మహిళలు కిడ్నాప్ నకు గురయ్యారని తాజా నివేదిక పేర్కొంది. ఇందులో 1,890 మంది మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యారని, ఇందులో 752 మంది చిన్నారులు సైతం వున్నారని తెలిపింది. 3,721 మంది చిత్రహింసలకు గురయ్యారని నివేదిక తెలియజేసింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

three + ten =