శత్రుదేశం పాకిస్థాన్‌లో హిందువులే లక్ష్యంగా దాడులు, హత్యలు కొనసాగుతున్నాయి. కరాచీ నగరంలో హిందూ వైద్యుడిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో వైద్యుడు మృతి చెందాడు. అలాగే వైద్యుడి వెంట వున్న సహాయకురాలికి బుల్లెట్ గాయాలు తగిలాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డా.జినానీ అనే హిందూ వైద్యుడు తన అసిస్టెంట్ అయిన ఓ వైద్యురాలితో కలిసి కారులో గుల్షణ్-ఏ-ఇక్బాల్ ప్రాంతానికి వెళుతుండగా ఈ దాడి జరిగింది. లైయారీ ఎక్స్‌ప్రెస్ హైవేలో ఈ ఘోరం జరిగిందని పోలీసులు తెలిపారు.
ఈ దాడిలో డా. జినానీ అక్కడిక్కడే మృతి చెందగా ఆయన సహాయకురాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. కాల్పుల తరువాత డా. జినానీ ప్రయాణిస్తున్న కారు అదుపు కోల్పోయి ఓ గోడకు ఢీకొనడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ ఘటనపై సింధ్ గవర్నర్ కమ్రాన్ ఖాన్ టెసోరీ విచారం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలంటూ కరాచీ పోలీస్ అడిషనల్ ఇన్స్‌స్పెక్టర్ జనరల్‌ను ఆదేశించారు.
ఐతే ఆ దేశంలో హిందువులపై దాడులు గతంలోనూ జరిగాయి. గతవారం దేశంలోని హిందూ వ్యాపారులను వేధించారు. వారు రంజాన్ ఆర్డినెన్స్‌ను అతిక్రమించారని, నిబంధనలకు విరుద్ధంగా తింటున్నారని పోలీసులు పలువురు వ్యాపారులపై దాడులకు పాల్పడ్డారు. అంతకుముందు కూడా చాలా సార్లు హిందూ కుటుంబాలు, హిందువులపై దాడులు అధికంగా జరిగాయి. అసలే ముస్లిం దేశం కావటం అందులోనూ హిందువులు మైనారిటీలుగా ఉండటంతో శత్రు దేశంలో వారి జీవనం నిత్యం నరకంగా మారుతోంది. ఏ క్షణంలో ఎలాంటి ఆపద ముంచుకోస్తుందోనని అక్కడి హిందువులు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. ఐతే శ్రీరామనవమి రోజున హిందూ డాక్టర్ ను వెంటాడి చంపడంతో పాక్ లో పరిస్థితి ఎలా ఉందో అర్ధం అవుతోంది.