హిమాచల్‌ప్రదేశ్ కిన్నౌర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది. కిన్నౌర్ జిల్లాలోని నిగుల్‌సేరి ప్రాంతంలో ఎన్‌హెచ్-5పై కొండచరియలు విరిగి వాహనాలపై పడ్డాయి. పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్డుపై వెళ్తున్న ఆర్టీసీ బస్సుతోపాటు ఇతర వాహనాలపై పడ్డాయి. దీంతో ఆర్టీసీ బస్సు రోడ్డుపై నుంచి కొట్టుకుపోయి లోయలో పడిపోయింది.
ఈ ఘటనలో మరణాల సంఖ్య 15కు పెరిగింది. శుక్రవారం ఉదయం మరో రెండు మృతదేహాలను సహాయక బృందాలు వెలికితీశాయి. దీంతో మృతులు 15కు చేరారు. ఈ ఘటనలో అధికారులు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం 4 గంటలకే ఎన్డీఆరెఫ్ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించారు. మొత్తం 40 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (హెచ్‌ఆర్‌టిసి) బస్సుతో పాటూ మరికొన్ని వాహనాలు శిథిలాల కింద ఇరుక్కున్నాయి.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ కిన్నౌర్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతాన్ని సందర్శించారు. గాయపడిన వారి బాగోగులను అడిగి తెలుసుకునేందుకు కిన్నౌర్ జిల్లాలోని భాబా నగర్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు కూడా వెళ్లారు. ఈ ఘటనలో చనిపోయిన వారి బంధువులకు ఒక్కొక్కరికి రూ .4 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ .50 వేలు ఇస్తామని సీఎం ప్రకటించారు. మరణించిన ప్రయాణికుల బంధువులకు రవాణా శాఖ ద్వారా రూ.లక్ష అందించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. గాయపడిన వారికి ఉచిత చికిత్స లభిస్తుందని భరోసా ఇచ్చారు. కొండచరియలు విరిగిపడిన ప్రదేశంలో దాదాపు 300 మంది ఐటీబీపీ సిబ్బందిని నియమించారు.