హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కన్నుమూత

హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వీరభద్ర సింగ్ కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వీరభద్ర సింగ్ గురువారం ఉదయం 3:40 గంటలకు షిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీలో తుదిశ్వాస విడిచారని సీనియర్ మెడికల్ సూపరింటెండ్ డాక్టర్ జనక్ రాజ్ వెల్లడించారు. 87 ఏళ్ల వయసున్న హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం వీరభద్ర సింగ్కు సోమవారం నాడు గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ఐజీఎంసీలో చికిత్స పొందుతున్నారని మీడియాకు ప్రకటన విడుదల చేశారు. వెంటిలేటర్ మీద ఉంచి కార్డియాలజీ నిపుణులు ఆయనకు చికిత్స అందించారు. అయితే డాక్టర్ల ప్రయత్నాలు ఫలించకపోవడంతో వీరభద్రసింగ్ కన్నుమూశారు. వీరభద్రసింగ్ మృతితో కాంగ్రెస్ శ్రేణుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీరభద్రసింగ్ రెండు నెలల వ్యవధిలో రెండుసార్లు కరోనా బారిపడ్డారు. మొదట ఏప్రిల్ 12న, జూన్ 11న కూడా మరోసారి కరోనా పాజిటివ్ వచ్చింది.
వీరభద్ర సింగ్ మొత్తం 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఐదు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్కు 6 సార్లు సీఎంగా పనిచేశారు. 1983 ఏప్రిల్ 8 నుంచి 1990 మార్చి 5 వరకు, ఆ తర్వాత 1993 డిసెంబరు 3 నుంచి 1998 మార్చి 23 వరకు, అనంతరం 2003 డిసెంబరు 29 నుంచి 2007 డిసెంబరు 29, ఆ తర్వాత 2012 డిసెంబరు 25 నుంచి 2017 డిసెంబరు 26 వరకు ముఖ్యమంత్రిగా సేవలందించారు. వీరభద్రసింగ్ భార్య ప్రతిభా సింగ్, కుమారుడు విక్రమాదిత్య రాజకీయాల్లో ఉన్నారు. ప్రతిభా సింగ్ మాజీ ఎంపీ కాగా.. ఆయన కుమారుడు విక్రమాదిత్య సిమ్లా రూరల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.