More

  కేరళలో హిజాబ్ మంటలు..! ఆ క్యాథలిక్ స్కూల్‎ ఏం చేసిదంటే..!!

  హిజాబ్ నిషేధాన్ని నిరసిస్తూ కేరళ ముస్లిం సంస్థలు ఆందోళనకు దిగాయి. స్కూల్ క్యాంపస్ లో బాలికలు హిజాబ్ ధరించడాన్ని కేరళ కోజికోడ్‌ క్యాథలిక్ పాఠశాల నిషేధించింది. రాష్ట్రంలో హిజాబ్ ను నిషేధించిన క్యాథలిక్ పాఠశాలల్లో ఇది రెండోది. హిజాబ్ ధారణను నిషేధించడంపై ముస్లిం యూత్ లీగ్, ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ నిరసన వ్యక్తం చేశాయి. రాష్ట్రంలోని క్యాథలిక్ పాఠశాలలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాయి.

  ప్రొవిడెన్స్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థిని హిజాబ్ ధరించి పాఠశాలకు హాజరైంది. స్కూల్ నిబంధనల ప్రకారం.. యూనిఫారంలో భాగం కానుందన, తలకు స్కార్ఫ్ ధరించరాదని పాఠశాల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో బాలిక తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. యాజమాన్యం పాఠశాల నిబంధనలకు బద్ధమై వుండడంతో, విద్యార్థిని టీసీ తీసుకుని స్కూల్ నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన అనంతరం ఎంవైఎల్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. విద్యార్థుల ప్రాథమిక హక్కుకు భంగం కల్గించేలా ప్రవర్తిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, ఈ తరహా సంస్థలపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర సర్కారు తటస్థ వైఖరి అవలంభిస్తే.. దానిని తాము అంగీకరించలేమని ఎంవైఎల్‌ తెలిపింది.

  ఈ నేపథ్యంలో ముస్లిం సంస్థలకు చెందిన పలువురు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. పాఠశాల ఎదుట ప్రదర్శనలు చేశారు. ఆందోళన తీవ్రతరం కావడంతో.. పోలీసులు రంగప్రవేశం చేశారు. గుంపును చెదరగొట్టి, కొందరు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  2022 ఆగస్టులో కోజికోడ్‌లో ఇలాంటి మరొక సంఘటన చోటుచేసుకుంది. అపోస్టోలిక్ కార్మెల్ సదరన్ ప్రావిన్స్, క్రిస్టియన్ మేనేజ్‌మెంట్ బోర్డ్‌ నిర్వహిస్తున్న కాథలిక్ పాఠశాలలో 11 వ తరగతి చదువుతున్న బాలిక హిజాబ్ ధారణకు యాజమాన్యం నో చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులు విద్యాశాఖ మంత్రి వి. శివన్ కుట్టికి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాడు, క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సహా అనేక ముస్లిం సంస్థలు నిరసన ప్రదర్శనను నిర్వహించాయి. దీని ఫలితంగా పాఠశాల వెలుపల ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి చక్కదిద్దారు.

  వ్యక్తి మతపర స్వేచ్ఛతో పాటు, లౌకికవాదానికి ఇది విరుద్ధమని విద్యార్థిని తండ్రి నాడు మీడియాకు వెల్లడించారు. హాఫ్ స్కర్ట్, ఓవర్ కోట్‌తో కూడిన టాప్.. విద్యార్థినులకు అసౌకర్యం కల్గించే రీతిలో వుండవచ్చని ఆయన తెలిపారు. అయితే, స్కూల్ యూనిఫారానికి కట్టుబడి వుండడానికి తమకు అభ్యంతరం లేదని, హిజాబ్ ధరించడానికి సైతం అనుమతి ఇవ్వాలని అన్నారు. కేరళ లాంటి రాష్ట్రంలో వ్యక్తి మత స్వేచ్ఛను ప్రశ్నార్థకం చేస్తున్న కారణంగా, తాను మంత్రికి ఫిర్యాదు చేశానని విద్యార్థిని తండ్రి తెలిపారు. పాఠశాల నిబంధనల్లో ఏ మార్పు లేదని, ఈ విషయాలు విద్యార్థినికి, ఆమె తండ్రికి వివరించామని పాఠశాల ప్రిన్సిపాల్ సిల్వి తెలిపారు.

  అయితే, ఈ ఆందోళనలో భాగస్వామ్యమైన క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్, జమాత్-ఇ-ఇస్లామీ-హింద్ విద్యార్థుల విభాగాలు పీఎఫ్ఐ దాని అనుబంధ సంస్థలు ఈ ఏడాది సెప్టెంబర్ 28 న భారత ప్రభుత్వంచే నిషేధించబడ్డాయి.

  హిజాబ్ ధారణ ఇచ్చాపూర్వకంగా జరగడం లేదని కొన్ని ఘటనలు వెల్లడిస్తున్నాయి. కొన్ని ముస్లిం దేశాలు సైతం.. హిజాబ్ ధారణపై తటస్థ వైఖరి అవలంభిస్తున్నట్టు తెలుస్తోంది. హిజాబ్ నియమాన్ని పాటించలేదని ఇరాన్ యువతి అమినీపై ఆ దేశంలో మోరల్ పోలీసులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆమె ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అయితే, ఆమెను తీవ్రంగా కొట్టడం వల్ల మరణించిందని సాక్షులు చెబుతుండగా, గుండెపోటుతో ఆమె మృతి చెందిందని ఇరాన్ పోలీసులు అంటున్నారు. హిజాబ్ పై చైతన్యం కల్గించడానికి ఆమెని అరెస్ట్ చేశామని, అయితే, గుండెపోటు సమస్యతో ఆమె ప్రాణాలు విడిచిందని.. పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. ఆ దేశంలో ఈ ఘటనపై తీవ్ర నిరసనలు తలెత్తాయి.

  అమినీ మరణం సైతం.. ఈ తరహా నేపథ్యంలోనే జరగడంతో అక్కడ దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ అనుకూలురు సహా అనేకమంది ఇరానియన్లు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గైడెన్స్ పెట్రోలింగ్‌గా పిలిచే మొరాలిటీ పోలీసింగ్‌ను వ్యతిరేకిస్తున్నారు. చాలామంది మర్డర్ పెట్రోల్స్ అనే హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తున్నారు. అధికారులు మహిళలను నేలపై ఈడ్చుకుంటూ తీసుకెళుతున్న, చితక బాదుతున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

  చాలామంది ఇరానియన్లు సుప్రీం లీడర్ అలీ ఖొమైనీపై నేరుగా విమర్శలు గుప్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఇస్లామిక్ పాలనలో మహిళలు ఇస్లామిక్ డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలని.. మొరాలిటీ పోలీసుల పాత్ర సమర్థనీయమని ఖొమైనీ చెబుతున్నట్లుగా ఉన్న ఒక పాత ప్రసంగం క్లిప్‌ను ప్రజలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు.

  Trending Stories

  Related Stories