More

    మహ్మద్‌ అబ్దుల్‌ సయ్యద్‌ అలియాస్‌ మున్నా భాయ్‌ పాపాల చిట్టా.. ఉరిశిక్ష ఖరారు

    తీస్తే మంచి సినిమా అవుతుంది.. ట్రెండ్ కి తగ్గట్టుగా తీస్తే వెబ్ సిరీస్ కూడా రెండు సీజన్లు సులువుగా తీయొచ్చు. అతడు చేసిన క్రైమ్ అలాంటిది మరి..! అతడొక నేరస్థుడు అని తెలిసినా కూడా రాజకీయ నాయకులు అండగా నిలిచారు. అతడిని దేశం దాటించాలని తీవ్రంగా ప్రయత్నించారు కూడా..! కానీ ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు. న్యాయస్థానం అతడికి ఉరి శిక్ష విధించింది. అతడికి సహకరించిన వాళ్లకు ఉరి శిక్షతో పాటూ.. యావజ్జీవ శిక్ష కూడా విధించింది. హైవే మీద టెర్రర్ పుట్టించిన మున్నాకు ఉరి శిక్ష విధించింది న్యాయస్థానం. తన గ్యాంగ్ తో కలిసి 17మంది అమాయక లారీ డ్రైవర్లను పొట్టన పెట్టుకున్నాడు. ఒంగోలు జిల్లా 8వ అదనపు సెషన్స్ కోర్ట్‌ ఈరోజు తుది తీర్పు వెలువరించింది. మున్నాతో పాటు 11 మందికి ఉరి శిక్ష విధించింది. మరో 7 గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.

    మున్నా హైవేలో లారీలు ఆపుతూ డ్రైవర్లను, క్లీనర్ లను హత్య చేసి లారీలు దొంగిలించడమే కాకుండా.. ఆ లోడుల్లో ఉన్న సరుకును కూడా అమ్మేస్తూ ఉండేవారు. ఎంతో మందిని చంపేస్తూ గడిపిన మున్నాను 2008లో అరెస్ట్ చేశారు ప్రకాశం జిల్లా పోలీసులు. తమిళనాడుకు చెందిన ఓ లారీ డ్రైవర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో మున్నాను అరెస్ట్‌ చేశారు పోలీసులు. విచారణలో అతని నేరాల చిట్టా మొత్తం బయటికి లాగారు. హైవేలో జరిగిన లారీ డ్రైవర్ల హత్యలన్నీ మున్నా గ్యాంగ్‌ చేసిందని నిర్ధారించారు. మున్నా నేర చరిత్ర చూసి పోలీసులే విస్తుపోయారు. ఓసారి బెయిల్‌పై వచ్చి తప్పించుకుపోయాడు మున్నా. అయితే దేశం దాటి వెళ్లలేకపోయాడు.

    మహ్మద్‌ అబ్దుల్‌ సయ్యద్‌ అలియాస్‌ మున్నా భాయ్‌.. కనిగిరికి చెందిన మున్నా టెన్త్‌ క్లాస్‌ వరకు మాత్రమే చదువుకున్నాడు. గుప్త నిధుల కోసం తిరుగుతూ తవ్వకాలు జరిపేవాడు. గుప్త నిధులు ఉన్నాయంటూ అమాయకులను మోసం చేస్తూ ఉండేవాడు. వారి దగ్గర డబ్బులు గుంజడం, తనకు డబ్బు ఇస్తే రాత్రి పూజలు జరిపి వాటిని రెట్టింపు చేస్తానని చాలా మంది అమాయకులను మోసం చేశాడు. ఆ తర్వాత ఎదుగుతూ ఓ గ్యాంగ్‌ ను తయారు చేసుకున్నాడు. దారి దోపిడీలు చేయడం ప్రారంభించాడు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చే డ్రైవర్లే ఇతని టార్గెట్. ఆర్టీవో ఆఫీసర్లమంటూ హైవేల్లో లారీలు ఆపేవాళ్లు. లారీ పేపర్స్‌ చూపించాలని డిమాండ్‌ చేసే వాళ్లు. డ్రైవర్లు పేపర్లు వెతికే పనిలో ఉండగా వారిపై దాడి చేసి హతమార్చేవాడు. ఐరన్ లోడుతో వెళ్లే లారీలను టార్గెట్ చేసి డ్రైవర్, క్లీనర్లను చంపి.. ఐరన్ లోడుతో పరారయ్యే వాళ్లు. ఐరన్ లోడు అమ్మేశాక, లారీలను తుక్కు కింద విడగొట్టి ఆ భాగాలను కూడా విక్రయించేవారు. హైవేపై వాహనాలు తనిఖీ చేస్తున్నట్టుగా లారీలను ఆపేవారు. మున్నా అధికారి వేషంలో ఉండగా, అతడి పక్కన ఓ వ్యక్తి గన్ మన్ గా మెషీన్ గన్ చేతబట్టి ఉండడంతో వారు నిజంగానే అధికారులని భావించి లారీ డ్రైవర్లు తమ వాహనాలు ఆపేవారు. చెక్ చేయాలనే నెపంతో లారీ డ్రైవర్లు, క్లీనర్ల గొంతుకలకు తాడు బిగించి దారుణంగా హత్య చేసేవారు. తాము చంపిన డ్రైవర్లు, క్లీనర్ల శవాలను గోతాల్లో కుక్కి హైవే పక్కనే వాగుల్లో పూడ్చిపెట్టేవారు. దోపిడీ చేసిన ఐరన్ లోడును గుంటూరులో అమ్మేవారు.

    ఒంగోలులో మున్నా నేరాలు తగ్గిపోయాయనని అందరూ అనుకున్నారు కానీ హైవేలపై దోపిడీలు, హత్యలు చేస్తున్న విషయాన్ని గుర్తించడానికి చాలా సమయమే పట్టింది. ఒక రోజు తమిళనాడుకు చెందిన ఓ డ్రైవర్‌ హైవేపై కొందరు వ్యక్తులు తనపై దాడి చేసి లారీని లాక్కున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డ్రైవర్‌ చెప్పిన ఆధారాల ప్రకారం ఈ దోపిడీలు చేస్తున్నది మున్నా ముఠా అని గుర్తించారు పోలీసులు. 2008లో లారీ డ్రైవర్లు, క్లీనర్లను దారుణంగా హతమార్చి వాగు వద్ద హైవే కిల్లర్‌ మున్నా గ్యాంగ్‌ పూడ్చి పెట్టిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. పశ్చిమ బెంగాల్‌ దుర్గాపూర్‌ నుంచి ఇనుప రాడ్ల లోడ్‌తో తమిళనాడులోని కల్పకంకు బయలుదేరిన లారీతోపాటు డ్రైవర్, క్లీనర్‌ అదృశ్యమయ్యారు. దీంతో 2008 అక్టోబర్‌ 17న లారీ యజమాని వీరప్పన్‌ కుప్పుస్వామి ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

    తన విషయంలో పోలీసులు అలర్ట్ అయ్యారనే విషయం తెలుసుకుని.. మున్నా రాష్ట్రం నుంచి పారిపోయాడు. బెంగళూరులోని ఓ మాజీ ఎమ్మెల్యేకు చెందిన తోటలో మున్నా తల దాచుకున్నాడు. దీంతో వెంటనే అక్కడికి వెళ్లి ముఠాతో సహా నిందితుడ్ని అరెస్ట్ చేశారు. కొద్దిరోజులకు మున్నా బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఏపీలో ఉంటే తనకు డేంజర్‌ అనుకుని అక్కడి నుంచి మహారాష్ట్రకు పారిపోయాడు. మహారాష్ట్రలో గన్‌ డీలర్స్‌తో లింక్‌ పెట్టుకున్నాడు మున్నా. వేరే రాష్ట్రాల నుంచి గన్స్‌ తెప్పించి అమ్మేవాడు. అక్కడ జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో మున్నా చనిపోయాడంటూ వార్తలు వచ్చాయి. మున్నా మాత్రం అక్కడి నుంచి తప్పించుకుని మళ్లీ ఒంగోలుకు వచ్చాడు. తనకు హైదరాబాద్‌లో చాలా భూములు ఉన్నాయంటూ అమాయకులను మోసం చేశాడు. అలాంటి సమయంలో ఓ జాతీయ రహదారిపై వ్యక్తిని హత్య చేసి అతని కారును ఎత్తుకెళ్లడంతో మున్నా బతికే ఉన్నాడని పోలీసులకు తెలియడంతో పక్కాగా ప్లాన్‌ చేసి మున్నాను అరెస్ట్‌ చేశారు. పోలీసులు బలమైన సాక్ష్యాధారాలను కోర్టు ముందు ఉంచారు. మున్నాతో సహా అతనిగ్యాంగ్ లోని మరో 11 మందికి ఉరిశిక్ష, నలుగురికి యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. సుదీర్ఘంగా సాగిన విచారణ అనంతరం ఒంగోలులోని 8వ అదనపు సెషన్స్ కోర్టు మున్నా, అతడి గ్యాంగ్ కు ఉరిశిక్షలు విధించింది. ఇందులో ప్రధాన ముద్దాయి మున్నా, అతడికి సహకరించిన 11 మందికి ఉరిశిక్ష విధించింది. మరో ఏడుగురికి యావజ్జీవ కారాగారశిక్ష విధించింది.

    Trending Stories

    Related Stories