ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాడిమర్రి మండలం గుండంపల్లికి చెందిన ఆరుగురు మహిళా కూలీలు పొలం పనుల కోసం చిల్లకొండయ్యపల్లికి ఆటోలో బయలుదేరారు. కొంతదూరం వెళ్లాక వారి ఆటోపై హైటెన్షన్ విద్యుత్ వైరు తెగిపడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనం కాగా, లక్ష్మి అనే మహిళ తీవ్ర గాయాల పాలైంది. ధర్మవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటి నుంచి బయలు దేరిన అరగంటలోపే 5 మంది మరణించారు. ముగ్గురు ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డారు. ఘటన జరిగిన సమయంలో ఆటోలో మొత్తం 10 మంది ప్రయాణిస్తున్నారు. గుడ్డంపల్లికి చెందిన కూలీలు.. ప్రతిరోజు వ్యవసాయం పనుల కోసం తెల్లవారుజామునే ఆటోలో పెద్దకోట్లకు వెళ్తారు ఎప్పటిలానే ఇంటి నుంచి బయలు దేరిన కాసేపటికే ఆటో మీద విద్యుత్ వైర్లు తెగి పడడంతో సజీవ దహనం అయ్యారు. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. మృతులంతా సమీప బంధువులే అని తెలుస్తోంది.