తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు ఓ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్‌పై హత్యాయత్నం చేశాడనే ఆరోపణలతో తాడిపత్రిలో హై టెన్షన్ మొదలైంది. టీడీపీ కార్పొరేటర్ ఇప్పుడు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో ఉన్నారని తెలుస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో తెలుగుదేశం అధికారంలో ఉంది. ఎమ్మెల్యేగా వైఎస్ఆర్‌సీపీకి చెందిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారు. అభివృద్ధి పనుల విషయంలో ఆయా పార్టీ నాయకులు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. భూగర్భ డ్రైనేజీకి సంబంధించిన పనులు మధ్యలో ఉండిపోవడంతో వివాదం కొనసాగుతూ ఉంది.
నంద్యాల రోడ్‌లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ మరమ్మత్తు పనులను టీడీపీ చేపట్టింది. గత రెండు రోజులుగా పూడికతీత పనులు కొనసాగుతుండగా.. తామే మరమ్మత్తులు చేపడతామంటూ వైఎస్ఆర్‌సీపీ నాయకులు పోటీగా జేసీబీలతో రావడం అక్కడ ఘర్షణ వాతావరణం నెలకుంది. ఈ నేపథ్యంలో 30వ వార్డు టీడీపీ కౌన్సిలర్ మల్లిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఉన్నారు. తాడిపత్రి ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. దాడి చేసిన ఘటనలో ఎమ్మెల్యే తనయుడిపై కేసు పెట్టి అరెస్ట్ చేయాలని టీడీపీ కౌన్సిలర్లు ధర్నాకు దిగారు. తమ కౌన్సిలర్‌పై ఎమ్మెల్యే కొడుకు దాడి చేయడాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి తేలికగా తీసుకునే అవకాశం లేకపోవడంతో శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందన్న ఆందోళనలో ప్రజలు ఉన్నారు. కౌన్సిలర్ చికిత్స తీసుకుంటున్న ప్రభుత్వ ఆస్పత్రి వద్ద బలగాల్ని మోహరించారు. ఈ అంశంపై ఇంకా జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించలేదు. ఎమ్మెల్యే తనయుడిపై కేసు పెట్టాల్సిందేనని టీడీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేస్తున్నారు.