తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో ఆదివారం ఉదయం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్‌కు చెందిన ఇద్దరు నేతల మధ్య ఉన్న విబేధాల కారణంగా ఉద్రిక్తత తలెత్తింది. గత కొద్దిరోజులుగా ఆ నేతలు సవాళ్లు చేసుకుంటూ ఉండగా.. ఇప్పుడు బహిరంగంగా మాట్లాడుకుందామని రచ్చ చేయడం మొదలు పెట్టారు.
ఈ గొడవ జూపల్లి కృష్ణారావు, హర్షవర్ధన్‌రెడ్డిల మధ్య మొదలైంది. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జూపల్లి కృష్ణారావు తెలంగాణ తొలి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో జూపల్లి ఓటమిపాలయ్యారు. జూపల్లిని కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్‌రెడ్డి ఓడించారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు శనివారం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. బహిరంగ చర్చెకు సిద్ధమంటూ ఇద్దరు నేతలు సవాళ్లు విసురుకున్నారు. పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద జూపల్లితో చర్చకు హర్షవర్ధన్ రెడ్డి బయలుదేరేందుకు సిద్ధపడ్డారు. అప్పటికే ఆయన ఇంటికి ఆయన అనుచరులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. పోలీసులు చర్చకు వెళ్లేందుకు హర్షవర్ధన్‌కు అనుమతి నిరాకరించారు. అయినా కూడా హర్షవర్ధన్ వినకపోవడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని తమ వాహనంలోకి ఎక్కించారు. అక్కడే ఉన్న హర్షవర్ధన్ అనుచరులు వాహనాన్ని కదలనీయకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి హర్షవర్ధన్‌ను పెద్దకొత్తపల్లికి తరలించారు.