ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రబాబు ఇంటి పక్కనున్న ప్రజా వేదికను కూల్చి ఇవాళ్టికి (జూన్ 25) మూడేళ్లు అవుతున్న సందర్భంగా శిథిలాల దగ్గర నిరసన తెలిపేందుకు టీడీపీ నేతలు సిద్ధమవడంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. చంద్రబాబు ఇంటి సమీపంలో భారీగా పోలీసులను మోహరించారు. కరకట్ట మీదకు వాహనాల రాకపోకలను నిలిపేశారు.
టీడీపీ హయాంలో కృష్ణా కరకట్టపై నాటి సీఎం చంద్రబాబు ఇంటి సమీపంలో నిర్మించిన ప్రజా వేదికను వైసీపీ ప్రభుత్వం కూల్చివేసి నేటితో సరిగ్గా మూడేళ్లు. ఈ నేపథ్యంలో ప్రజా ధనంతో కట్టిన ప్రజా వేదికను కూల్చివేసిన జగన్ సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు ప్రజా వేదిక వద్ద నిరసనలకు సిద్ధమయ్యాయి.
జగన్ చేసినవన్నీ కూల్చివేతలేనని, రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు డిస్ట్రక్షన్ తప్ప కన్‌స్ట్రక్షన్ చేతకాదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధిని, ఆర్థిక పరిస్థితిని, దళితుల గూడును, ప్రజాస్వామ్య వ్యవస్థలను, రాష్ట్ర యువత భవిష్యత్తును.. ఇలా అన్నింటినీ కూల్చేశారు అని చంద్రబాబు నాయుడు విమర్శించారు. ప్రజలు కోరుకున్న అమరావతి రాజధాని కలలను, పోలవరం స్వప్నాన్ని చిదిమేసి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని.. జగన్ ఈ మూడేళ్లలో కట్టినది ఏమీ లేదని, అంతా శూన్యమని మండిపడ్డారు. గత ప్రభుత్వం కట్టిన నిర్మాణాల్లోనే పాలన కొనసాగిస్తున్నారని.. తన వల్ల ఏమీ జరగదని, జగన్ కేమీ రాదని తేలిపోయిందని వ్యాఖ్యానించారు.