National

ఉరుముతోన్న ఉగ్రమూక..! భాగ్యనగరానికి భారీ ముప్పు..?

భారతీయులు ఆనందంగా ఉంటే ఉగ్రదేశానికి నచ్చదు. మనం వేడుకలు చేసుకుంటే పాక్ కళ్లల్లో నిప్పులు పోసుకుంటుంది. భారత్ పై దాడులు చేసేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అందులోనూ స్వాతంత్ర దినోత్సవం వచ్చిందంటే ఉగ్రమూకను భారీగా మనపై వదులుతుంటుంది.

ఈసారి మాత్రం ముష్కరులు భాగ్యనగరాన్నే టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 15 వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. హైదరాబాద్ తో పాటు దేశంలో వివిధ సున్నితమైన ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరగొచ్చని ఐబీ తెలిపింది. ఈ మేరకు ఇంటెలిజెన్స్ అధికారులు తెలంగాణ సహా అన్ని రాష్ట్రాలకు సర్క్యులర్లు పంపారు. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఎలాంటి కమ్యూనల్ గొడవలు జరగకుండా అల్లర్లు జరిగే సున్నిమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని ఆ సర్క్యులర్ ‌లో కోరారు.

బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ మహ్మద్ ప్రవక్తపైన చేసిన వ్యాఖ్యల ఫలితంగా ఉదయ్ పూర్, అమరావతి ప్రాంతాల్లో జరిగిన కమ్యూనల్ గొడవలను ఈ సందర్భంగా ఐబీ అధికారులు ప్రస్తావించారు. ఉదయ్ పూర్ ‌లో జరిగిన టైలర్ మర్డర్ కేసు వ్యవహారంలో హైదరాబాద్ కు చెందిన కొందరు అనుమానితులను కూడా జాతీయ దర్యాప్తు సంస్థ – ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారు. ఇటీవల నిజామాబాద్ నుంచి కొన్ని ఉగ్ర కార్యకలాపాలు, ఫండింగ్ జరుగుతుందని ఎన్ఐఏ అధికారులు గుర్తించింది.

ఐబీ హెచ్చరికలతో తెలంగాణ పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే అందరు పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సున్నిత ప్రాంతాల్లో రాత్రిపూట పెట్రోలింగ్ పెంచాలని, అనుమానితులను గుర్తించాలని ఆదేశించారు. తరచూ సాధారణ గొడవలు జరిగే ప్రాంతాల్లోనూ నిఘా పెంచి, అల్లర్లకు కారణమయ్యే వారిని అదుపులోకి తీసుకోవాలని సూచించారు. లష్కర్-ఏ-తైబా, జైష్-ఏ-మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ హెచ్చరించింది. దేశ రాజధాని పాటు కీలక నగరాలను పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు టార్గెట్ చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో ఇప్పటికే హైదరాబాద్‌ లోని పర్యాటక ప్రాంతాలు, వీవీఐపీలు ఉండే ప్రదేశాల్లో హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, రద్దీ ప్రదేశాల్లో నిఘాను పెంచారు. అటు శంషాబాద్ విమానాశ్రయంలో ఈ నెల 30 వరకు హైఅలర్ట్ కొనసాగిస్తామని అధికారవర్గాలు వెల్లడించాయి.

అటు జమ్ముకశ్మీర్​లోని భారత సైన్యానికి చెందిన శిబిరంపై గురువారం తెల్లవారుజామున ఆత్మహుతి దాడి జరిగింది. రజౌరీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైనిక శిబిరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాజా ఘటనలో ముగ్గురు జవాన్లు వీర మరణం పొందారు. ఇదే ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు సైతం మరణించారు. రజౌరీ జిల్లా దర్హల్​ ప్రాంతంలోని సైనిక శిబిరంలోకి చొచ్చుకెళ్లేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అక్కడి సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. వారి చర్యలను సైన్యం ప్రతిఘటించింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు- భద్రతాదళాల మధ్య ఎన్​కౌంటర్​ సంభవించింది. ఈ ఆత్మహుతి దాడి వెనుక లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్టు సైన్యం అనుమానిస్తోంది.

ఇక ఈ దాడికి ఒక్క రోజు ముందు జమ్ము కశ్మీర్​లో భారీగా పేలుడు పదార్థాలను అక్కడి పోలీసులు, భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నారు. పుల్వామా జిల్లాలోని తహాబ్ క్రాసింగ్ వద్ద 25-30 కేజీల ఐఈడీని రికవరీ చేసుకున్నట్లు భద్రతా దళాలు ప్రకటించాయి. దీంతో దేశంలో భారీ ఉగ్రముప్పు తప్పినట్లైంది. దీంతో పోలీసులు కశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రైల్వే స్టేషన్లలో నిఘా పెట్టారు. స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో అదనపు బలగాలను రంగంలోకి దించారు. స్పెషల్ డాగ్ స్క్వాడ్, రైల్వే భద్రతా దళం స్టేషన్ల పరిసరాల్లో నిరంతరం గస్తీ కాస్తున్నాయి. ప్రయాణికులను, వారి సామగ్రిని తనిఖీ చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

five × 5 =

Back to top button