More

    విజయవాడ, తిరుపతి రైల్వే స్టేషన్స్ వద్ద భారీ భద్రత

    కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న అగ్నిపథ్ కార్యక్రమానికి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆందోళనకారులు మూడు రైళ్లకు నిప్పుపెట్టి విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాదులో మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లను ఆపేశారు. నాంపల్లి స్టేషన్ ను మూసివేశారు. ఈ నేపథ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్ లో హైఅలర్ట్ ప్రకటించారు. విజయవాడతో పాటు రాష్ట్రంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో భద్రతను పెంచారు. అదనపు భద్రతను రప్పించారు. తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో భారీగా పోలీసులను మోహరించారు.

    అగ్నిప‌థ్ స్కీమ్‌పై ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ మ‌నోజ్ పాండే ఓ ప్ర‌క‌ట‌న చేశారు. ఆర్మీ ప‌రీక్ష కోసం సిద్ద‌మ‌వుతున్న యువ‌త‌కు వ‌యోప‌రిమితిని 23 ఏళ్ల‌కు పెంచిన‌ట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు. ఈ నిర్ణ‌యం వ‌ల్ల దేశంలోని యువ‌త‌కు త‌మ దేశ‌భ‌క్తిని చాటుకునే అవకాశం దొరుకుతుంద‌ని, కోవిడ్ స‌మ‌యంలోనూ తీవ్రంగా క‌ష్ట‌ప‌డ్డ యువ‌త‌కు ఇప్పుడు మంచి అవ‌కాశం ల‌భిస్తుంద‌ని ఆయ‌న అన్నారు. గ‌డిచిన రెండేళ్లు కోవిడ్ ఆంక్ష‌ల వ‌ల్ల ఆర్మీ రిక్రూట్మెంట్‌ను నిర్వ‌హించ‌లేద‌న్నారు. రిక్రూట్మెంట్‌కు చెందిన షెడ్యూల్‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు ఆర్మీ చీఫ్ మ‌నోజ్ పాండే తెలిపారు.

    Related Stories