టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారంలో జరిగిన లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గత కొద్దిరోజులుగా విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే..! డ్రగ్స్ కేసులో నిందితుడు కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పటికే అధికారులు టాలీవుడ్ ప్రముఖులు పూరి జగన్నాథ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందు, రానాను విచారించారు. ఈ రోజు హీరో రవితేజను విచారిస్తున్నారు. నోటీసులు అందుకున్న నేపథ్యంలో ఈ రోజు ఈడీ అధికారుల ముందు రవితేజ కూడా విచారణకు హాజరయ్యారు. ఎఫ్‌క్లబ్‌తో ఉన్న పరిచయాలు, విదేశీ టూర్లు, కెల్విన్‌తో ఉన్న సంబంధాలపై ఈడీ ప్రశ్నలను అడగనుంది. మనీలాండరింగ్, ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి రవితేజతో పాటు డ్రైవర్ శ్రీనివాస్‌ను విచారించనున్నారు.
రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ కూడా విచారణకు హాజరయ్యాడు. కెల్విన్ నుంచి శ్రీనివాస్‌కు డ్రగ్స్ అందాయని ఈడీ దృష్టికి రావడమే కాకుండా శ్రీనివాస్ పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని తెలుగు మీడియా సంస్థలు చెబుతున్నాయి. డ్రగ్స్‌కు సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జరిగాయన్న విషయంపై అధికారులు విచారించనున్నారు. రవితేజకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కెల్విన్ తో టాలీవుడ్ ప్రముఖులకు ఉన్న సంబంధాలు, అతడితో జరిపిన వాట్సప్ చాటింగ్‌ను అధికారులు ఇప్పటికే సేకరించారు.
దగ్గుబాటి రానాను ఈడీ అధికారులు దాదాపు ఏడున్నర గంటల సేపు విచారించారు. మనీలాండరింగ్ కోణంలో రానా బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించిన అధికారులు, అనుమానాస్పద లావాదేవీలపై ప్రశ్నించారు. ఎఫ్ క్లబ్ గురించి కూడా ప్రశ్నలు అడిగారు. కెల్విన్ ఎవరో తనకు తెలియదని రానా చెప్పినట్టు తెలుస్తోంది. విచారణ ముగిసిన తర్వాత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన రానాను మీడియా ప్రశ్నలు అడగగా.. ఏమీ మాట్లాడకుండానే ఆయన తన కారెక్కి రానా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. డ్రగ్స్ కేసులో నిందితుడు కెల్విన్ ను కూడా ఇప్పటికే అధికారులు విచారించారు. కెల్విన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు లొంగిపోవడంతో అధికారులు అతడి నుంచి కీలక వివరాలు రాబట్టారు. కెల్విన్ ఇచ్చిన సమాచారం మేరకు పలువురిని ప్రశ్నిస్తున్నారు. కెల్విన్ సెల్ఫోన్లో ఉన్న పలువురి ఫోన్ నంబర్లు, వారితో జరిపిన వాట్సప్ చాటింగ్‌ను అధికారులు పరిశీలించారు.