More

    అమేథీలో AK-203..!
    వరల్డ్ ఢిఫెన్స్ హబ్ మారబోతున్న భారత్..!!

    21వ ఇండో-రష్యన్ సమావేశంలో ఇరు దేశాలు పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. భారత్‎లో 6 లక్షలకు పైగా ‘AK-203 అసాల్ట్’ రైఫిళ్ల తయారు చేయనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉమ్మడి ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో భారత సైనికుల అమ్ములపొదిలో ‘AK-203 అసాల్ట్’ ప్రధాన అస్త్రాలుగా మారనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఈ రైఫిళ్లను తయారుచేయనున్నారు. ‘ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్‎’తో పాటు.. ‘మ్యునిషన్స్ ఇండియా లిమిటెడ్’, రష్యాకు చెందిన ‘రోసోబోరోనెక్స్‌పోర్ట్’, ‘కలష్నికోవ్ ఆఫ్ రష్యా’ కంపెనీలు రైఫిళ్ల తయారీ ప్రాజెక్టును అమలు చేయనున్నాయి. ఇందులో ‘ఇండో-రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్‎’ సంస్థను రైఫిళ్ల తయారీకోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ ప్రకటన ద్వారా దేశంలో ఆయుధాల స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా.. భారత్‎ను ఆసియాలో ప్రధాన ఆయుధ ఎగుమతిదారుగా మార్చడంపై మోదీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవలికాలంలో రక్షణరంగంలో మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి.

    ఆయుధాల ఎగుమతి రంగంలో భారత్‎కు విశేషమైన అవకాశాలున్నా.. గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఇతర దేశాలకు ఎగుమతి చేయడంపై దృష్టిసారించింది. అయితే, ఎగుమతులు ప్రారంభించిన అనతికాలంలో భారత్ విశేష ప్రగతిని కనబరిచింది. కేవలం ఏడేళ్లలో 38 వేల కోట్ల విలువైన ఎగుమతులు చేసింది భారత ప్రభుత్వం. గతేడాది ‘డిఫెన్స్ ఎక్స్‎పో’లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ.. 2014లో 2 వేల కోట్ల విలువైన రక్షణ పరికరాలను ఎగుమతి చేసినట్టు తెలిపారు. గత రెండేళ్లలో ఎగుమతుల విలువ 17 వేల కోట్లకు చేరిందన్నారు. రానున్న ఐదేళ్లలో ఎగుమతులను ఏటా 35 వేల కోట్లకు చేర్చడమే లక్ష్యమని ప్రకటించారు. గత ఐదేళ్లలో రక్షణ ఎగుమతులు 325 శాతం పెరిగాయన్న మోదీ.. రక్షణ ఉత్పత్తుల్లో నైపుణ్యాన్ని సాధించడమే కాకుండా.. స్వదేశీ ఆయుధాలను ‘గ్లోబల్ బ్రాండ్లు’ మార్చడమే లక్ష్యమని తెలిపారు.

    డీ-లైసెన్సింగ్, డీ-రెగ్యులేషన్, విదేశీ పెట్టుబడుల సంస్కరణలు, ఎగుమతులకు ప్రోత్సాహం వంటి చర్యలను మోదీ ప్రభుత్వం పకడ్బందీగా చేపట్టింది. ఇందుకోసం 2020లో ‘Draft Production and Export Promotion Policy’ని రూపొందించింది. ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలలో చేపట్టిన ‘Production Linked Incentive’ విజయవంతమయ్యాయి. దీంతో రక్షణ రంగానికి సంబంధించి కూడా ప్రభుత్వం అదే తరహా ప్రణాళికపై దృష్టిపెట్టిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. డ్రోన్‌లు, డ్రోన్ భాగాల సేకరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకాన్ని ఆమోదించింది. ఇది ఆర్థిక వ్యవస్థలోని దాదాపు అన్ని రంగాలకు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. వ్యవసాయం, మైనింగ్, మౌలిక సదుపాయాలు, నిఘా, ఎమర్జెన్సీ రెస్పాన్స్, రవాణా, జియో-స్పేషియల్ మ్యాపింగ్, రక్షణ, లా ఎన్‎ఫోర్స్‎మెంట్‎ వంటి పలు ప్రధాన రంగాల్లో డ్రోన్ల వ్యవస్థ ఉపయోగపడనుంది. అంతేకాదు, ఇటీవల ‘ఆత్మనిర్భర్ భారత్’లో భాగంగా ఏరోస్పేస్, డిఫెన్స్ పరికరాల తయారీకోసం యూపీ, తమిళనాడులో డిఫెన్స్ కారిడార్లను ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రకటించింది. ఈ నిర్ణయం దేశంలో రక్షణరంగ తయారీకి మరింత ఊతమివ్వనుంది. ఒక్క డిఫెన్స్ కారిడార్ వల్ల దేశంలో 200 భారతీయ సంస్థలకు ప్రయోజనం చేకూరుతుంది. దాదాపు 8 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

    డిఫెన్స్ కారిడార్ కోసం చెన్నై, తిరుచ్చి, సేలం, హోసూర్, కోయంబత్తూరు ప్రాంతాలను గుర్తించారు. తమిళనాడు కూడా 2019లో ప్రత్యేకమైన ఏరోస్పేస్, డిఫెన్స్ ఇండస్ట్రీ పాలసీని ఆవిష్కరించింది. ఇప్పటికే DRDO ఆధ్వర్యంలో చెన్నైలో ‘కొంబాట్ వెహికల్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‎మెంట్’ సంస్థ ఆర్మీకి సేవలందిస్తోంది. ఆర్మర్డ్ ఫైటింగ్ వెహికల్స్, ట్యాంకులు, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ సహా అనేక ఇతర సైనిక పరికరాల అభివృద్ధిలో ఈ సంస్థ ప్రధానపాత్ర పోషిస్తోంది. ఇదిలావుంటే, ఇప్పటికే యూపీ రక్షణ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. అమెరికా, యూకే, జపాన్, కెనెడా, జర్మనీ, దక్షిణ కొరియాకు చెందిన అనేక కంపెనీలు రాష్ట్రంలో తమ తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ దేశాలు ఇప్పటికే 45 వేల కోట్ల పెట్టబడులను ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. దీని ద్వారా కోటీ 35 లక్షల ఉద్యోగాలు లభించనున్నాయి.

    కేంద్ర ప్రభుత్వం చొరవతో ఇప్పటికే దేశంలో 12 వేల సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు రక్షణ తయారీ రంగంలో పాలుపంచుకుంటున్నాయని ఇటీవల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. రక్షణ తయారీ రంగంలో ప్రయివేటు కంటే కూడా ప్రభుత్వ రంగ సంస్థలనే ఎక్కువగా వినియోగించుకుంటున్నామని అన్నారు. ప్రస్తుతం దేశంలో వున్న ఎరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమ విలువ 85 కోట్లని.. ఇందులో ప్రైవేట్ రంగం వాటా 18 కోట్లకు చేరినట్టు తెలిపారు రాజ్‎నాథ్.

    ప్రపంచ ఆయుధ వ్యాపారాన్ని ట్రాక్ చేసే స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక ప్రకారం.. ఇప్పటికే మూడు భారతీయ ఆయుధ కంపెనీలు టాప్-100 లోకి ప్రవేశించాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 2.97 బిలియన్లతో HAL 42వ స్థానంలో ఉంది. 2019 పోలిస్తే HAL ఎగుమతులు 1.5 శాతం పెరిగాయి. ఇక, 1.9 బిలియన్ డాలర్లతో ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ 60వ స్థానంలో కొనసాగుతోంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంస్థ 0.2 శాతం వృద్ధి సాధించింది. అలాగుచ 1.63 బిలియన్లతో 66వ స్థానంలో వున్న BEL.. 2019తో పోలిస్తే 4 శాతం వృద్ధి సాధించింది. భారత రక్షణ వ్యవస్థ స్వావలంబనను మెరుగుపరిచే దిశగా.. ‘ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు’ను ఏడు వందశాతం ప్రభుత్వ-యాజమాన్య కార్పొరేట్ సంస్థలుగా మార్చింది మోదీ ప్రభుత్వం.

    దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. గత ప్రభుత్వాలు రక్షణ పరికరాల తయారీలో ప్రయివేటు సంస్థల ప్రవేశాన్ని పరిమితం చేశాయి. HAL, OFB వంటి పెద్ద కంపెనీలపైనే దృష్టిసారిస్తూ వచ్చాయి. అయితే, ప్రస్తుత ప్రభుత్వం రక్షణ తయారీ రంగం పునర్నిర్మాణంపై దృష్టిపెట్టింది. సామర్థ్యం ఆధారంగా పలు కంపెనీల సేవలను వినియోగించుకుంచుకోవడం ప్రారంభించింది. గత ఆగస్ట్‎లో మహీంద్ర అండ్ మహీంద్ర అనుబంధ సంస్థ అయిన.. మహీంద్ర డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ తో భారత ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. యుద్ధనౌకల కోసం ఇంటిగ్రేటెడ్ యాంటీ సబ్‎మెరైన్ వార్‎ఫేర్ డిఫెన్స్ సూట్ల తయారీ కోసం దాదాపు 1,350 కోట్ల విలువైన అగ్రమెంట్ చేసుకుంది. మహీంద్రా అండ్ మహీంద్రా మాదిరిగానే, ఎకనామిక్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్ అనే మరో ప్రైవేట్ స్వదేశీ సంస్థ.. ప్రభుత్వ విశ్వాసాన్ని నిలబెట్టుకుంది. భారతదేశంలో తొలిసారి దేశీయంగా తయారు చేసిన మల్టీ-మోడ్ హ్యాండ్ గ్రెనేడ్‌ల మొ దటి బ్యాచ్‌ను పంపిణీ చేసింది. DRDO కు చెందిన టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ నుంచి సాంకేతికతను బదిలీ చేసిన తర్వాత.. ఈ గ్రెనేడ్ల అభివృద్ధి సాధ్యమైంది. మొత్తానికి రక్షణ తయారీ రంగం విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహిరిస్తోంది. రక్షణ పరికరాల తయారీ కోసం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, స్వదేశీ స్టార్టప్ కంపెనీలను విశేషంగా ప్రోత్సహిస్తోంది. వాటి సేవలను వినియోగించుకోవడం ద్వారా.. రక్షణ పరికరాల తయారీలో దేశం స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా, ఎగుమతుల్లోనూ దూసుకుపోతోంది.

    Related Stories