తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో తుంగభద్ర ఆయకట్టు రైతుల్లో ఆనందం కనిపిస్తోంది. గత ఏడాది కంటే ఈ ఏడాది ముందుగానే వర్షాలు పడుతుండడంతో తుంగభద్ర జలాశయానికి అధికంగా నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 1605.56 నమోదు కాగా, ప్రస్తుతం జలాశయంలో 27.48టిఎంసి నీరు నిలువ ఉన్నట్లు చెప్పుకొచ్చారు. తుంగభద్ర జలాశయం పైభాగంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో తుంగ, భద్ర నదులు పొంగి ప్రవహిస్తున్న కారణంగా శివమొగ్గ జిల్లా పరిధిలో గాజగనూరు వద్ద తుంగ నదిపై నిర్మించిన గాజగనూరు, భద్ర జలాశయం నుంచి వేలాది క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదులుతున్నారు. ఆ నీరు నేరుగా తుంగభద్ర జలాశయానికి వచ్చి చేరుతోంది. దీంతో తుంగభద్ర జలాశయం వరద నీటితో కళకళలాడుతోంది. గత ఏడాది ఇదే సమయానికి 7.03 టీఎంసీలు నిలువ ఉండగా, 1,234 క్యూసెక్కుల నీరు చేరినట్లు బోర్డు అధికారులు తెలిపారు. వరద ఇలాగే కొనసాగితే జూన్‌లోనే తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉందని బోర్డు అధికారులు తెలిపారు.