International

భారీ వర్షాలు.. ఈజిప్టులో బయటకొచ్చిన భయంకరమైన తేళ్లు

ఈజిప్టులో ఇటీవల భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా ఒక్కసారిగా తేళ్లు బయటకు వచ్చాయి. ఇళ్లలోకి కూడా చేరుకున్నాయి. విషపూరితమైన తేళ్లు కుట్టడంతో ముగ్గురు మరణించారు. 500 మందికి పైగా తేళ్ల కాటుకు గురయ్యారని తెలుస్తోంది. నివేదికల ప్రకారం ఈజిప్టులోని దక్షిణ నగరమైన అస్వాన్‌లో ఇటీవల ఉరుములతో కూడిన వర్షం కారణంగా వేలాది తేళ్లు బహిరంగ ప్రదేశాల్లోకి రావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడి నుండి వీధుల్లోకి, ఇళ్లలోకి కూడా ఈ తేళ్లు చొరబడ్డాయి.

స్థానిక మీడియా తేలు కాటు కారణంగా మూడు మరణాలు సంభవించాయని తెలిపింది. తాత్కాలిక ఆరోగ్య మంత్రి ఖలీద్ అబ్దేల్ గఫార్, మాట్లాడుతూ అస్వాన్ ప్రావిన్స్‌లో వడగళ్ళు, ఉరుములతో కూడిన వర్షం కారణంగా తేళ్లు బయటకు రావడంతో అధికారులంతా అప్రమత్తమయ్యారని తెలిపారు. స్థానిక అధికారులు పాఠశాలలను మూసివేశారని.. తుఫానుల కారణంగా తేళ్లు బయటకు వచ్చి ప్రావిన్స్‌లోని అనేక ఇళ్లలోకి చొరబడ్డాయని తెలిపారు. తేలు కుట్టడంతో కనీసం 503 మంది ఆసుపత్రిలో చేరారని, వారందరికీ తేలు కాటుకు విరుగుడు డోస్ ఇచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. వరదల కారణంగా ఇళ్ళు, వాహనాలు మరియు వ్యవసాయ పొలాలు దెబ్బతిన్నాయి. వర్షాల కారణంగా విద్యుత్‌కు కూడా అంతరాయం ఏర్పడిందని ప్రజలు తెలిపారు. ప్రస్తుతం అస్వాన్ గవర్నరేట్‌లోని ఆసుపత్రులలో 3,350 మోతాదుల విరుగుడు మందులు అందుబాటులో ఉన్నాయి. 89 కేసులు అస్వాన్ యూనివర్శిటీ హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతుండగా, 118 మంది కోమ్ ఓంబో సెంట్రల్ హాస్పిటల్‌లో ఉన్నారు. అస్వాన్‌లోని మిగిలిన గాయపడిన వ్యక్తులు ఎడ్ఫు, అబౌ సింబెల్, ద్రౌ, నాస్ర్ అల్-నుబా ఆసుపత్రులలో ఉన్నారు.

Related Articles

Back to top button