యాదాద్రి, శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు

0
623

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పోటెత్తారు. ఆదివారం సెల‌వు దినం కావ‌డంతో యాదాద్రికి సంద‌ర్శ‌కుల తాకిడి పెరిగింది. స్వామి వారి ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు క్యూలో వేచిఉన్నారు. ఉచిత దర్శననాకి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం ప‌ట్ట‌నుంద‌ని అధికారులు తెలిపారు. ఉద‌యం నుంచే భ‌క్తులు అధిక సంఖ్య‌లో రావ‌డంతో క్యూ లైన్లు ఆలయ తిరువీధులు నిండిపోయాయి. సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా భ‌క్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శివాలయంలో కార్తీక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు.

శ్రీశైలం శ్రీమల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామి, అమ్మవార్ల అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు. కార్తికమాసం, ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి వెళ్లారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి.. ఆలయానికి ఎదురుగా ఉన్న గంగాధర మండపం, శివమాడ వీధుల్లో కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. కార్తిక మాసోత్సవాల సందర్భంగా ఆలయంలో గర్భాలయం అభిషేకాలు, స్పర్శ దర్శనం తదితర సేవలను అధికారులు తాత్కాలికంగా నిలిపేశారు.