ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్థి నష్టం చోటు చేసుకుంది. వర్షానికి వరద నీరు తోడవడంతో పలు నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో చాలా గ్రామాలు నీట మునిగిపోయాయి. భారీ వర్షాలతో అతలాకుతలమైన నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో నేడు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఉదయం తాడేపల్లిలో ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షిస్తారు. అనంతరం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కడప చేరుకుంటారు. అక్కడ్నించి హెలికాప్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. ఏరియల్ సర్వే ముగిసిన అనంతరం రేణిగుంట చేరుకుని.. అక్కడినుంచి తిరిగి గన్నవరం రానున్నారు.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వరదలపై ఏపీ సీఎం జగన్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలపై సీఎం జగన్ ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న జిల్లాల పరిస్థితిని ప్రధానికి జగన్ వివరించారు. చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో వరద పరిస్థితులను, ఆయా ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలిపారు. వరద బాధితులకు సాయం కోసం నేవీ హెలికాప్టర్లు ఉపయోగించుకుంటున్నామని వెల్లడించారు. ఎలాంటి సాయం కావాలన్నా అడగాలని సీఎం జగన్ కు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. వరద సహాయ చర్యల్లో కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
అనంతపురం జిల్లా కదిరిలోని పాత చైర్మన్ వీధిలో నిర్మాణంలో ఉన్నమూడంతస్తుల భవనం.. పక్కనే ఉన్న మరో రెండస్తుల భవనం మీద పడింది. ఈ ఘటన జరిగినప్పుడు బిల్డింగ్‌లో 15 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే నలుగురు వ్యక్తులు బిల్డింగ్‌నుంచి సురక్షితంగా బయట పడ్డారు. బిల్డింగ్‌లో చిక్కుకున్న ఐదుగురు ఫోన్‌లో మాట్లాడుతున్నారని స్థానికులు తెలిపారు. కుండపోత వర్షం కారణంగానే భవనం దెబ్బతిని.. ఈ ఘటన జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు జేసీబీలతో శిథిలాలను తొలగిస్తున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలను ముమ్మరం చేశారు.
బంగాళాఖాతంలో వాయు గుండం నేపథ్యంలో కురిసిన వర్షాలు రాయల సీమలో బీభత్సం సృష్టించాయి. 540 గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. 23 మంది గల్లంతయ్యారు. 9 మంది మృతదేహాలు లభించాయి. వైఎస్సార్ జిల్లాలో పింఛా, అన్నమయ్య ప్రాజెక్టుల మట్టికట్టలు తెగిపోయాయి. దీంతో ఒక్కసారిగా పోటెత్తిన వరద పలు ఊళ్లను ముంచేసింది.