More

    జమ్మూ, హిమాచల్ లో వరదలు.. ఢిల్లీలో రికార్డు స్థాయిలో వర్షం

    జ‌మ్ముకాశ్మీర్‌లోని కిష్ట‌వ‌ర్ ప్రాంతాన్ని భారీ వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. కిష్టవ‌ర్ ప్రాంతంలోని హంజార్‌లో బుధ‌వారం ఉద‌యం ఒక్క‌సారిగా భారీ వ‌ర‌ద రావడంతో చాలా ఇళ్లు కొట్టుకుపోయాయి. దీంతో ఐదుగురు మృతి చెందారని.. 40 పైగా గ‌ల్లంత‌య్యారని అధికారులు తెలిపారు. కిష్టవర్, హంజార్‌ గ్రామంతో బాటు ‘దాచన్’ తహశీల్ లోని పలు గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. గత కొన్ని రోజులుగా జమ్మూ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం ఒక్కసారిగా వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వేల మందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. పలు గ్రామాలకు జమ్మూతో రోడ్డు సంబంధాలు తెగిపోయాయని కిష్టవర్ జిల్లా మేజిస్ట్రేట్ అశోక్ కుమార్ శర్మ తెలిపారు. ఆర్మీ, పోలీసు బృందాలు శిథిలాలను తొలగించి బాధితులను కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. నదుల్లో నీటి ప్రవాహం పెరగనుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతారణ శాఖ హెచ్చరించింది.

    దేశ రాజధాని ఢిల్లీలో జూలై నెలలో ఇప్పటివరకు 381 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2003 తర్వాత జూలైలో ఇదే అత్యధిక వర్షాపాతమని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీ పరిధిలో మంగళవారం ఉదయం కేవలం మూడు గంటల్లోనే వంద మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైందట..! ఇంతకు ముందు 2013, జూలై 21న 123.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నెలలో 14 రోజులు వర్షాలు కురిశాయి. ఐఎండీ డేటా ప్రకారం సఫ్దర్‌జంగ్‌ అబ్జర్వేటరీ పరిధిలో ఈ నెల 27 వరకు 108 శాతం అధిక వర్షపాతం రికార్డయింది. సాధారణ వర్షపాతం 183.5 మిల్లీమీటర్లు.. 2003లో ఆల్‌ టైమ్‌ రికార్డు స్థాయిలో 632.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

    హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. వరదల్లో చిక్కుకొని ఎనిమిది మృతి చెందగా.. మరో ఎనిమిది గల్లంతయ్యారు. కులు జిల్లాలో నలుగురు, లాహౌల్‌ – స్పితి జిల్లాలో ముగ్గురు, చంబా జిల్లాలో ఒకరు మృతి చెందారని హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్‌ సుదేష్‌కుమార్‌ మోక్త తెలిపారు. వర్షంతో లాహౌల్‌కు వెళ్లే రహదారులపై కొండచరియలు విరిగిపడ్డాయి. పార్వతి నదికి ఉపనది అయిన బ్రహంగంగ నది ఉగ్రరూపం దాల్చింది. వరదల్లో కొట్టుకుపోయిన వారిని వెతికేందుకు పోలీసులతో పాటు, ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ) బృందాలను పంపారు.

    Related Stories