More

  పాఠశాలలకు సెలవు..!

  తెలంగాణలో భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే..! లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు. అవసరముంటేనే తప్ప బయటకు రావద్దని ఇప్పటికే అధికారులు ప్రజలకు సూచించారు. వికారాబాద్ జిల్లాలో విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్ ఈరోజు సెలవు ప్రకటించారు. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వరద నీరు రోడ్లపైకి వస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ లోని జలాశయాలకు కూడా పెద్ద యెత్తున నీరు వచ్చి చేరుతుంది. గండిపేట రిజర్వాయర్ లో 12 గేట్లు ఎత్తి వేశారు. హిమాయత్ సాగర్ లో 8 గేట్లను ఎత్తి వేశారు. ముసారాం బ్రిడ్జి, చాదర్ ఘాట్ బ్రిడ్జిపై రాకపోకలను అధికారులు నిలిపేశారు. బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

  రంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల కుంభవృష్టి కురిసింది. చేవెళ్ల మం డలం కందవాడలో అత్యధికంగా 13.5, షాబాద్‌ మం డల కేంద్రంలో 12.1 సెంటీమీటర్ల వర్షం పడింది. ఈసీ, మూసీ నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుండటంతో జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌కు వరద ఉధృతి పెరిగింది.

  హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మెహదీపట్నం, అత్తాపూర్, టోలిచౌకీ, హైటెక్‌సిటీ, గచ్చిబౌలిలో అలాగే గోల్కొండ, షేక్‌పేట్, మణికొండ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయాయి. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చాలా చురుకుగా కదులుతుండడంతో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు హైదరాబాద్‌, వికారాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో అతిభారీ వర్షం కురిసింది. ఆదిలాబాద్‌, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం రాజస్థాన్‌ తూర్పు ప్రాంతం నుంచి మధ్యప్రదేశ్‌, తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, ఏపీ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి వ్యాపించి ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం చెప్పింది. రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా మరో ద్రోణి వ్యాపించింది. వీటి ప్రభావంతో ఈ నెల 30 వరకు రాష్ట్రంలోని భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

  Trending Stories

  Related Stories