కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు వర్షాలు పడతాయని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. శుక్రవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శనివారం ఉత్తరాంధ్ర, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నెల 10 వరకు సముద్రంలో చేపల వేటపై నిషేధం విధించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో అక్టోబరు 10 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ లో నేడు(శుక్రవారం) వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జనగాం, సిద్దిపేట, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.