121 సంవత్సరాలలో మే నెలలో రికార్డుస్థాయిలో వర్షపాతం

మే నెలలో భారీగా వర్షాలు కురిశాయి. కొన్ని తుఫానులు కూడా భారత్ ను ఇబ్బందులు పెట్టాయి. అయితే మే నెలలో రికార్డు స్థాయిలో వర్షం పడింది. మే నెలలో అరేబియా సముద్రం,బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడ్డాయి. అరేబియా సముద్రంలో ఏర్పడితన తౌక్టే తుఫాన్ తీవ్ర రూపం దాల్చి మే 17న గుజరాత్ తీరాన్ని తాకింది. బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాన్ తీవ్రరూపం దాల్చి మే 26న ఒడిశా వద్ద తీరాన్ని తాకింది. ఈ తుఫాన్ల ప్రభావంతో తూర్పు,పశ్చిమ రాష్ట్రాలలోనే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ వర్షాలు కురిశాయి.
121 సంవత్సరాలలో అత్యధిక వర్షపాతం నమోదవ్వడం రెండోసారని భారత వాతావరణ శాఖ (ఐఎండి) గురువారం తన నెలవారీ నివేదికలో తెలిపింది. ఒకదాని వెంట మరొకటి.. ఇలా రెండు తుఫానులు రావడం కూడా భారీ వర్షానికి కారణమని వాతావరణ కార్యాలయం పేర్కొంది. భారతదేశంలో మే నెలలో సగటు ఉష్ణోగ్రత 34.18 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంది. మేలో భారతదేశంలో ఇంత తక్కువ సగటు గరిష్ట ఉష్ణోగ్రత 1901 తరువాత నమోదవ్వడం నాల్గవసారని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 1917 లో 32.68 డిగ్రీల సెల్సియస్. 1977 నుండి 33.84 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
1901 నుంచి ఇప్పటివరకూ నమోదైన నాలుగో అత్యల్ప ఉష్ణోగ్రతగా తెలిపింది. దేశంలో అత్యల్ప ఉష్ణోగ్రత 32.68 డిగ్రీల సెల్సియస్ 1917లో నమోదైంది. దేశవ్యాప్తంగా మే నెలలో 107.9 మి.మీ వర్షపాతం నమోదైంది. సుదీర్ఘ కాల సగటు (ఎల్పీఏ) 62 మి.మీ. కంటే ఇది 74 శాతం అధికం. దేశంలో 1990లో అత్యధికంగా 110.7మి.మీ వర్షపాతం నమోదైంది. ఈసారి దేశవ్యాప్తంగా ఎక్కడా ఎండల ప్రభావం పెద్దగా కనిపించలేదు.
ప్రస్తుతం నైరుతి రుతు పవనాల ఆగమనంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ముంబైని వర్షం ముంచెత్తింది. ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఒడిశా సహా పలు రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది.