More

    హైదరాబాద్ లో కుండపోత వర్షం.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు

    గులాబ్‌ తుఫాను ప్రభావంతో హైదరాబాద్ నగరంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సుమారు గంట నుంచి ఏకధాటిగా బోరున వాన కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాల జలమయమయ్యాయి. కోఠి, సుల్తాన్‌బజార్‌, బేగంబజార్‌, పాతబస్తీ, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, ఆల్విన్‌కాలనీ, నిజాంపేట, ప్రగతినగర్‌, ఎల్‌బీనగర్‌, నాగోల్‌, మన్సూరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. వనస్థలీపురం, బీఎన్‌రెడ్డినగర్‌, తుర్కయాంజల్‌, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, బోరబండ, అల్లాపూర్‌, మోతీనగర్‌, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, ఈఎస్‌ఐ, రహమత్‌నగర్‌, అమీర్‌పేట్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కుండపోత వాన కురుస్తోంది. గచ్చిబౌలి, మాదాపూర్‌, మియాపూర్‌, కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌, మణికొండ, ఫిల్మింనగర్‌, యూసుఫ్‌గూడ, సైదాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చార్మినార్‌, రామంతాపూర్‌, అంబర్‌పేట, మలక్‌పేట, పాటు పలు ప్రాంతాల్లో వాన కురుస్తోంది. ఎడతెరిపి లేని వర్షంతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పటికే మరికొద్ది గంటల పాటు నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. హైదరాబాద్‌లో క‌లెక్ట‌రేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 040 23202813 కాల్ చేయాల‌ని చెప్పారు.

    భారీ వర్షాలపై నగర కమిషనర్ అంజనీకుమార్ పోలీస్‌ అధికారులు, సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సిటీ ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ఎలాంటి సమస్య వచ్చినా 100 నంబర్‌కు డయల్ చేయాలని సూచించారు. పెట్రోలింగ్, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

    గులాబ్ తుఫాన్ ప్ర‌భావంతో ఇప్ప‌టికే తెలంగాణలో ప‌లుచోట్ల భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు మహబూబాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, ఆదిలాబాద్, కుమురంభీం అసిఫాబాద్, మంచిర్యాలలో వ‌ర్షాలు కురుస్తున్నాయి.

    Trending Stories

    Related Stories