దేశ రాజధాని ఢిల్లీలో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో రికార్డుస్థాయిలో వానలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి చిన్నగా కురుస్తున్న వర్షం ఈ ఉదయం కుండపోతగా మారింది. నగరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏకధాటిగా కురిసిన వానకు రహదారులపైకి నడుము లోతులో నీళ్లు చేరి నదులను తలపిస్తున్నాయి. భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అండర్ పాస్ వంతెన వద్ద నీరు చేరడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను నిలిపివేశారు. రాగల 12 గంటల్లో ఢిల్లీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం రాత్రి నుంచి సఫ్దర్‌జంగ్ ప్రాంతంలో 94.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 46ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా అత్యధిక వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాకాలం ప్రారంభమైన జూన్ 1 నుంచి ఢిల్లీలో 987.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 81 శాతం ఎక్కువ అని ఐఎండీ అధికారులు తెలిపారు.
శనివారం కురిసిన భారీ వర్షానికి ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ (IGI) విమానాశ్రయంలోకి పెద్ద ఎత్తున నీరు చేరుకున్నాయి. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) ట్విట్టర్‌లో భారీ వర్షం కారణంగా నీళ్లు చేరిపోయాయని తెలిపింది. “భారీ వర్షం కారణంగా ప్రయాణికులు కొద్దిసేపు ఇబ్బంది ఎదుర్కొంది. ఆన్-గ్రౌండ్ టీమ్ వెంటనే పనులు చేపట్టడంతో ఉదయం 9 గంటల నుండి కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చాయి” అని DIAL ట్వీట్ చేసింది. ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పులు చూస్తున్నామని మరో ట్వీట్ లో తెలిపింది ఎయిర్ పోర్టు సిబ్బంది. పలు విమానాలను డైవర్ట్ చేసినట్లు కూడా ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. ఢిల్లీ విమానాశ్రయం రన్ వేలోనే గాక, విమానాశ్రయంలోకి కూడా వరదనీరు చేరింది. దీంతో పలు విమాన సర్వీసులకు కూడా అంతరాయం కలిగింది. నిరంతరం కురుస్తున్న వర్షాల కారణంగా ఏయిర్ పోర్టులోకి వరద నీరు చేరింది. ప్రవేశ ద్వారం వద్ద నుంచి లోపల వరకు వరద నీరు చేరింది. ఈ మేరకు పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు సూచనలు చేశాయి. రాకపోకలు, విమానాలు బయలుదేరడంలో ఆలస్యమయ్యే సూచనలున్నాయని.. ప్రయాణికులు గమనించగలరని తెలిపాయి.
శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు కురిసిన భారీ వర్షాలతో ఢిల్లీలో ఎక్కడికక్కడ భారీగా నీరు నిలిచిపోయింది. శనివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ హెచ్చరిక జారీ చేసింది. ఆదివారం కూడా తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.