కెనడా ప్రజలు పిట్టల్లా రాలిపోతూ ఉన్నారు. అందుకు కారణం విపరీతమైన వేడి, వడగాలులే..! పశ్చిమ కెనడాలో హీట్ వేవ్ కారణంగా బ్రిటిష్ కొలంబియాలో భారీగా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ 486 ఆకస్మిక మరణాలు సంభవించాయి. ఇది సాధారణం కంటే దాదాపు 165 రెట్లు ఎక్కువ.. అని చెబుతూ ఉన్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతూ ఉన్నారు. ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఎండ వేడిమిని, వడగాడ్పులను తట్టుకోలేక కన్నుమూశారు. దీంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించడంతో పాటు అత్యవసరమైతేనే ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలని సూచించారు.
బ్రిటిష్ కొలంబియాలోని లైటన్లో ఉష్ణోగ్రతల్లో ఆల్ టైమ్ కెనడియన్ రికార్డు సృష్టించబడింది. ఇక్కడ ఉష్ణోగ్రత 121 డిగ్రీల ఫారెన్‌హీట్ (49.5 డిగ్రీల సెల్సియస్) కు చేరుకుంది. సంవత్సరంలో ఈ సమయంలో వాతావరణం చాలా చల్లగా ఉండాలి. కానీ విపరీతమైన వేడి ప్రజలను ఆశ్చర్యపరిచింది. వాంకోవర్ లో కూడా పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, కరోనా టీకా కేంద్రాలను, స్కూళ్లను మూసివేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ టీకాల పంపిణీ ఉండబోదని అధికారులు తెలిపారు. ఎండ నుంచి ఉపశమనానికి నడి రోడ్లపై టెంపరరీ వాటర్ ఫౌంటెయిన్ లు, నీటి జల్లు కేంద్రాలను, పలు ప్రాంతాల్లో కూలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రావిన్స్ లోని అతిపెద్ద నగరమైన వాంకోవర్లో ఎయిర్ కండిషనింగ్ లేని ఇళ్ళల్లో నివాసిస్తున్న వాళ్లు డౌన్‌టౌన్ హోటళ్లకు వెళ్లిపోయారు. చెక్ ఇన్ చేయడానికి చాలా గంటలు క్యూలో నిలబడ్డారు. పీక్ విద్యుత్ డిమాండ్ ఆల్-టైమ్ గరిష్టాలను 600 మెగావాట్ల కంటే ఎక్కువ చేరింది. ఇక యూఎస్ లోని పలు ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా పోర్ట్ లాండ్, ఓరెగాన్, సియాటెల్, వాషింగ్టన్ ప్రాంతాల్లో విద్యుత్ కు డిమాండ్ పెరుగగా, సరఫరాకు అంతరాయాలు ఏర్పడ్డాయి. వెస్ట్ యూఎస్ లోని 4 కోట్ల మందిని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరికొంత కాలం పాటు అధికంగా నమోదు కావచ్చని, అందరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. యూఎస్ లోని 11 జిల్లాల్లో రికార్డు స్థాయిలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.