More

    మాస్క్ లు పెట్టుకోవడంపై కీలక వ్యాఖ్యలు చేసిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

    తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు మాస్క్ ల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసిందని ఆయన చెప్పుకొచ్చారు. కరోనాతో రెండేళ్ల పాటు ఎంతో ఇబ్బంది పడ్డామని, మాస్క్ ధరించడాన్ని అసౌకర్యంగా భావించామని చెప్పారు. కరోనా కేసులు భారీగా తగ్గిన పరిస్థితిలో ఇష్టమైతే మాస్క్ ధరించవచ్చని, లేకపోతే లేదని అన్నారు. మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమానా కొనసాగుతుందని… అయితే ఈ విషయంలో పోలీసులు చూసీ చూడనట్టు పోవాలని సూచించారు. రాష్ట్రం మొత్తం మీద రోజుకు 40 కేసులు నమోదవుతున్నాయని, 20 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కావడం లేదని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిథిలోనే 20 వరకు కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు మాత్రం మాస్క్ కచ్చితంగా ధరించాలని శ్రీనివాసరావు సూచించారు. ఇంకా ముప్పు పూర్తిగా తొలగిపోనందువల్ల మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం మంచిదేనని అన్నారు.

    ఇక భారతదేశంలో గత 24 గంటలలో దాదాపు 6 లక్షల మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 1,335 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 1,918 మంది కోలుకోగా 28 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 13,672 ఉన్నాయి. రికవరీ రేటు 98.76 శాతానికి చేరుకుంది. ఇప్పటి వరకు దాదాపు 4.30 కోట్ల మందికి కరోనా సోకగా 5,21,181 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 184 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 18,244 శాంపిల్స్ పరీక్షించగా, 31 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 23 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 73 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన ఒక్కరోజు వ్యవధిలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 7,91,284 మంది కరోనా బారినపడగా, వారిలో 7,86,753 మంది కోలుకున్నారు. ఇంకా 420 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

    Trending Stories

    Related Stories