దేశంలో ఎక్కడ ఉగ్ర కుట్ర జరిగినా మూలాలు తెలంగాణలో కనిపిస్తాయి. అలాగే తెలంగాణలో ఎక్కడ ముష్కర కదిలికలు వెలుగులోకి వచ్చినా దాని మూలాలు హైదరాబాద్ లో తెలుతాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి బయటపడింది.
హర్యానా పోలీసులు భారీ ఉగ్రవాద కుట్రను భగ్నం చేశారు. కర్నాల్ ప్రాంతంలో నలుగురు ఖలిస్థానీ టెర్రరిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, ఆయుధాలు, టిఫిన్ బాంబులను హర్యానా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో పేలుడు సామాగ్రి దొరకడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
ఇంటెలిజెన్స్ సమాచారంతో బస్తారా టోల్ ప్లాజా సమీపంలో ఫిరోజ్‌పూర్‌కు చెందిన 3, లూథియానాకు చెందిన ఒక తీవ్రవాద అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను గుర్‌ప్రీత్, అమన్‌దీప్, పర్మీందర్, భూపిందర్‌గా గుర్తించారు. వీరి వయస్సు 20 నుంచి 25 సంవత్సరాల మధ్యే ఉంటుందని చెప్పారు. నిందితులు పాకిస్థాన్ నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్‌కు డ్రోన్స్ ద్వారా ఆయుధాలు, పేలుడు పదార్థాలను చేరవేస్తున్నట్లు తెలిసిందని కర్నాల్ ఎస్పీ తెలిపారు.
పాక్ సరిహద్దులు దాటి నిందితుల్లో ఒకరైన గుర్‌ప్రీత్‌కు ఫిరోజ్‌పూర్ జిల్లా వరకు డ్రోన్ సాయంతో పేలుడు పదార్థాలు చేరవేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే నాందేడ్ వరకు పేలుడు పదార్థాలను చేర్చినట్లు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేశామని కర్నాల్ ఎస్పీ తెలిపారు.