డేరా బాబాకు జడ్ ప్లస్ సెక్యూరిటీ

0
857

అత్యాచారం, హత్య కేసుల్లో దోషిగా తేలి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తోన్న డేరా సచ్చా సౌదా బాబా రామ్ రహీమ్(డేరా బాబా)కు జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త కల్పించారు. హ‌ర్యానా ప్ర‌భుత్వం అందుకు సంబంధించి మంగ‌ళవారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. జైలు శిక్ష అనుభ‌విస్తున్న‌ డేరా బాబా ఇటీవలే పెరోల్ పై జైలు నుంచి విడుదలయ్యాడు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెరోల్ పై జైలు నుంచి విడుదలైన తర్వాత డేరాబాబాను ఖలిస్థానీ తీవ్రవాదులు టార్గెట్ చేశారనే వార్తలు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో డేరా బాబాకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పంజాబ్ ఎన్నికల సమయంలో డేరాబాబాకు కోర్టు 21 రోజుల పెరోల్ మంజూరు చేసింది. ఫిబ్రవరి 7న జైలు నుంచి విడుదలయ్యాడు డేరా బాబా.

రామ్ రహీమ్, తన ఆశ్రమంలో ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. రోహ్‌తక్‌లోని సునారియా జైలు నుండి 21 రోజుల పెరోల్ లో తాత్కాలికంగా విడుదలయ్యాడు. Z-ప్లస్ కేటగిరీలోని వ్యక్తులకు ఎక్కడకు వెళ్లినా భద్రత కోసం 10 మంది భద్రతా సిబ్బందిని, నివాస భద్రత కోసం ఇద్దరు (ప్లస్ ఎనిమిది మంది) ను పొందుతారు. Z-Plus స్థాయి భద్రతను నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు అందిస్తారు.

ఇంతకు ముందు డేరా బాబాకు పెరోల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ పంజాబ్-హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ మేరకు హర్యానా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల ప్రారంభంలో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు పెరోల్ మంజూరు చేసిన ప్రాతిపదికన సమర్పించడానికి హర్యానా ప్రభుత్వానికి సమయాన్ని ఇచ్చింది. పంజాబ్‌లోని పాటియాలా నివాసి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు పెరోల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటీషన్‌లో, గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తీవ్రమైన ఆరోపణలపై దోషిగా నిర్ధారించబడ్డాడని, ఇప్పటికీ కోర్టులు విచారిస్తున్న అనేక ఇతర క్రిమినల్ కేసులలో నిందితుడిగా ఉన్నారని, అలాంటి వ్యక్తికి అసెంబ్లీ ఎన్నికల ముందు ఫర్‌లాఫ్‌ మంజూరు చేయడం సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నారు. పంజాబ్ ఎన్నికల ఫలితాలను మార్చడానికి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తన ప్రభావాన్ని చూపగలడని, అందుకే అతనికి మంజూరు చేసిన పెరోల్ ను రద్దు చేయాలని పిటీషన్ లో కోరారు.