టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వద్ద ఉన్న అత్యంత ఖరీదైన వాచ్‌లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీ తర్వాత హార్దిక్ యూఏఈ నుంచి భారత్‌కు తిరిగి వస్తున్న క్రమంలో ఎయిర్‌పోర్టులో తనిఖీల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వాచ్‌ల విలువ సుమారు 5 కోట్ల రూపాయలు. నవంబరు 14 రాత్రి జరిగిన ఈ ఘటన జరిగింది. ఆ వాచీలకు సంబంధించిన బిల్లులు, ఇన్‌వాయిస్‌లు పాండ్యా చూపకపోవడంతో పాండ్యాని ఆపిన కస్టమ్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
హార్దిక్ పాండ్యా వద్ద అత్యంత ఖరీదైన, ప్రసిద్ధ కంపెనీలకు చెందిన వాచ్ కలెక్షన్ ఉంది. వీటిలో పటేక్ ఫిలిఫ్ నాటిలస్ ప్లాటినమ్ 5711 ప్రముఖమైంది. జీక్యూ ఇండియా రిపోర్టు ప్రకారం ఈ వాచ్ మొత్తం ప్లాటినమ్‌తో రూపొందించబడింది. 32 బాగెట్ కట్ ఎమరాల్డ్స్ పొదిగి ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ బ్రాస్‌లెట్ కూడా ఉంటుంది. కస్టమర్లు కోరిన విధంగా వారికిష్టమైన రీతిలో వాచ్‌ను తయారు చేసి ఇస్తారు. పటేక్ ఫిలిఫ్ నాటిలస్ ప్లాటినమ్ 5711 ధర రూ. 5 కోట్లకు పైగా ఉంటుంది.
గత సంవత్సరం హార్దిక్ అన్నయ్య, కృనాల్ పాండ్యా దుబాయ్ నుండి తిరిగి వస్తుండగా బంగారం మరియు ఇతర విలువైన వస్తువులను కలిగి ఉన్నారనే అనుమానంతో ముంబై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. కృనాల్ వద్ద 1 కోటి రూపాయల విలువైన బంగారం మరియు కొన్ని లగ్జరీ వాచీలు దొరికాయి. డీఆర్‌ఐ అధికారులు కేసును ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్‌కు అప్పగించారు.
ఇక నవంబర్ 17 నుంచి ప్రారంభం కానున్న న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో హార్దిక్‌ను టీమ్ ఇండియా జట్టులో చేర్చలేదు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో పాండ్యా విఫలమయ్యాడు. 69 పరుగులు మాత్రమే చేశాడు.. పూర్తీ ఫిట్నెస్ తో కనిపించలేదు. అలాంటి ఆటగాడిని ఎందుకు ప్రముఖ సిరీస్ కు సెలెక్ట్ చేశారనే విమర్శలు కూడా వచ్చాయి.