More

    తన మీద వచ్చిన ఆరోపణలపై స్పందించిన హార్దిక్ పాండ్యా

    టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా వద్ద ఉన్న అత్యంత ఖరీదైన వాచ్‌లను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. టీ20 వరల్డ్‌కప్ టోర్నీ తర్వాత హార్దిక్ యూఏఈ నుంచి భారత్‌కు తిరిగి వస్తున్న క్రమంలో ఎయిర్‌పోర్టులో తనిఖీల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వాచ్‌ల విలువ సుమారు 5 కోట్ల రూపాయలు. నవంబరు 14 రాత్రి జరిగిన ఈ ఘటన జరిగింది. ఆ వాచీలకు సంబంధించిన బిల్లులు, ఇన్‌వాయిస్‌లు పాండ్యా చూపకపోవడంతో పాండ్యాని ఆపిన కస్టమ్స్‌ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

    కస్టమ్స్ డ్యూటీ కట్టకుండా పాండ్యా వాటిని తీసుకొచ్చాడనే కథనాలపై పాండ్యా స్పందించాడు. కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారనే వార్తల్లో నిజం లేదని పాండ్యా చెప్పాడు. దుబాయ్ నుంచి తాను రూ. 1.5 కోట్ల విలువైన ఒక వాచ్ మాత్రమే తెచ్చానని, మీడియాలో వార్తలు వస్తున్నట్టుగా రూ. 5 కోట్ల విలువైన రెండు వాచ్ లు తీసుకురాలేదని తెలిపాడు. ముంబై ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే తన వద్ద ఉన్న బిల్లులు చూపించి, కస్టమ్స్ డ్యూటీ కట్టేందుకు తానంతట తానే కస్టమ్స్ కౌంటర్ దగ్గరకు వెళ్లానని చెప్పాడు. పర్చేజ్ డాక్యుమెంట్లన్నింటినీ సమర్పించాలని తనను కస్టమ్స్ అధికారులు కోరారని పాండ్యా తెలిపాడు. అధికారులు అడిగిన అన్నింటినీ తాను వారికి ఇచ్చానని చెప్పాడు. వాచ్ కు సంబంధించి అధికారులు ప్రస్తుతం వాల్యుయేషన్ చేస్తున్నారని, వారు ఎంత సుంకం చెల్లించమంటే అంత చెల్లిస్తానని తెలిపాడు. తాను చట్టాలను గౌరవించే వ్యక్తినని.. అన్ని ప్రభుత్వ వ్యవస్థలను తాను గౌరవిస్తానని చెప్పాడు. ముంబై కస్టమ్స్ అధికారుల నుంచి తనకు మంచి సహకారం అందిందని తెలిపాడు. తాను కూడా అన్ని విధాలా సహకరిస్తానని వారికి చెప్పానని అన్నాడు. తాను చట్ట వ్యతిరేకంగా వ్యవహరించానని వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పాడు.

    హార్దిక్‌ పాండ్యా వద్ద అత్యంత ఖరీదైన, ప్రసిద్ధ కంపెనీలకు చెందిన వాచ్‌ కలెక్షన్‌ ఉంది. వీటిలో పటేక్‌ ఫిలిఫ్‌ నాటిలస్‌ ప్లాటినమ్‌ 5711 ప్రముఖమైంది. పటేక్‌ ఫిలిఫ్‌ నాటిలస్‌ ప్లాటినమ్‌ 5711 ధర రూ. 5 కోట్లకు పైగా ఉంటుంది. జీక్యూ ఇండియా రిపోర్టు ప్రకారం ఈ వాచ్‌ మొత్తం ప్లాటినమ్‌తో రూపొందించబడింది. 32 బాగెట్‌ కట్‌ ఎమరాల్డ్స్‌ పొదిగి ఉంటాయి. ఇంటిగ్రేటెడ్‌ బ్రాస్‌లెట్‌ కూడా ఉంటుంది. కస్టమర్లు కోరిన విధంగా వారికిష్టమైన రీతిలో వాచ్‌ను తయారు చేసి ఇస్తారు.

    Trending Stories

    Related Stories