More

  చమురు ఎక్కడైనా కొంటాం..! భారత్ ఎవరి ముందూ తలొగ్గదు..!! హర్దీప్ వ్యాఖ్యలతో CNN యాంకర్‎ షాక్..!!

  కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరి అంతర్జాతీయ వార్తా ఛానెల్ వేదికగా భారత వైఖరిని మరోసారి కుండబద్ధలు కొట్టారు. రష్యా ఉక్రెయిన్ యుద్దాన్ని భారత్ కు ఆపాదించవద్దని.. తమది స్వతంత్ర్య నిర్ణయాలు తీసుకునే దేశమని తేల్చి చెప్పారు. ప్రముఖ సీఎన్ఎన్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో అంతర్జాతీయ మీడియా వైఖరిని కూడా ఎండగట్టారు.

  రష్యా ఉక్రెయిన్ యుద్దం జరుగుతున్న సమయంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటంపై భారత్‎కు ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. 130 కోట్ల ప్రజలున్న భారత్‎కు అవసరమైన చమురును అందించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. అది కూడా తక్కువ ధరకే ప్రజలకు అందేలా చూసి వారిపై ఆర్థిక భారం పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దీనికోసం తాము ఎక్కడైనా చమురును కొంటామని తేల్చిచెప్పారు. అది రష్యా అయినా మరే ఇతర దేశమైనా తమ అవసరాలను తీర్చేదిగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొంటామన్నారు. ఇప్పటికే భారత్ కు తక్కువ ధరలోనే చమురు అందించడానికి రష్యా డిస్కౌంట్ లను అందించిందని ఇంతకంటే తక్కువగా మరే ఇతరదేశమైనా అందించడానికి ముందుకొస్తే భారత్ వారివద్ద కూడా కొంటుందని స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో రష్యా నుంచి భారత్ తన అవసరాల్లో కేవలం 0.2 శాతం మాత్రమే దిగుమతి చేసుకుందని,.. ఇది యూరప్ దేశాలు ఒక్క మధ్యహ్నానికి ఖర్చు చేసే పెట్రోల్‎తో సమానమన్నారు. సెప్టెంబర్ లో భారత్ ఇరాక్ నుంచి ఎక్కువగా చమురు దిగుమతులు చేసుకుందని.. తాము కేవలం ఒకేదేశంపై ఆధారపడటం లేదని సీఎన్ఎన్ వార్తా సంస్థతో అన్నారు. అంతేకాదు, ఇతర దేశాలతో చమురును కొనేది భారత ప్రభుత్వం కాదనీ దాన్ని భారత్ లోని ప్రైవేటు సంస్థలు నిర్వహిస్తాయని తెలిపారు. ఆయా సంస్థలకు ఎక్కడ తక్కువ ధరలకు లభిస్తే అక్కడ కొనే స్వేచ్చను భారత ప్రభుత్వం కల్పించిందన్నారు. తాము రష్యా నుంచే కాకుండా అటు అమెరికా, కెనడా, గయానా నుంచి కూడా కొన్నామని ఈ విధంగా స్వతంత్రంగా కొనే స్వేచ్చ తమకుందని స్పష్టం చేశారు.

  అంతేకాదు, సీఎన్ఎన్ యాంకర్ హర్దీప్ సింగ్ పూరీని ఒక ప్రశ్న వేసి ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. ఒకవేళ భారత్ కు వ్యతిరేకంగా అమెరికా యూరప్ దేశాలు ఒత్తిడి చేస్తే ఏం చేస్తారని ప్రశ్నించింది. దీనికి హర్దీప్ సింగ్ పూరి తెలివిగా జవాబిచ్చారు. అవన్నీ అంతర్జాతీయ మీడియా సంస్థల ఊహాజనిత ప్రశ్నలని తెలిపారు. ఆయా దేశాలు అటువంటి ఆలోచనలను చేసినా భారత్ వారి ముందు తలొగ్గదని స్పష్టం చేశారు. భారత్ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని.. భారత్ ఏ దేశపు ఒత్తిడికీ తలొగ్గదని తమకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే హక్కు ఉందన్నారు.

  ఈవిధంగా అంతర్జాతీయ వార్తా సంస్థ వేదికగా అగ్రదేశాల ద్వంద వైఖరిని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి మరోసారి ఎండగట్టారు. తమ స్వార్థం కోసం యుద్దాన్ని మొదలు పెట్టి భారత్ ను తమ వెంట నడవమనే అగ్రదేశాలకు అంతే దీటుగా జవాబిచ్చారు. భారత్‎కు ప్రజల శ్రేయస్కరమే తొలి ప్రాధాన్యత అని అగ్రరాజ్యాల కోసం భారత ప్రయోజనాలను తాకట్టు పెట్టేందుకు సిద్దంగా లేమని మరోసారి స్పష్టం చేశారు. అంతేకాదు, అగ్రదేశాలకు వంత పాడే అంతర్జాతీయ మీడియాను కూడా ఊహాజనిత కథనాలు రాయడం మాని నిజమైన జర్నలిజం చేయమని ఆయా సంస్థల వేదికపైనే స్పష్టం చేశారు.

  ఇక రష్యా ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో భారత్‎పై చమురు కొనుగోలు విషయంలో అమెరికా, యూరప్ దేశాలు తప్పుబడుతున్నాయి. అయితే, యుద్దం తర్వాత అమెరికా విధించిన ఆంక్షలతో ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఆయా దేశాలన్నీ తీవ్ర చమురు సంక్షోభంలో కొట్టుమిట్టాడాయి. అయితే భారత్ మాత్రం తెలివిగా రష్యా తో చమురును కొంటోంది. యుద్దం సమయంలో అన్ని దేశాలూ చమురు ధరలను భారీగా పెంచాయి. అదే సమయంలో రష్యా భారీ డిస్కౌంట్ ప్రకటించడంతో భారత్ రష్యా తో చమురు దిగుమతులను పెంచింది.

  Trending Stories

  Related Stories