హనుమంతుడి జన్మస్థలం తెలుగు నేలపైనే..!

0
762

శ్రీరాముడి జన్మస్థానం అయోధ్య.. సీత పుట్టింది మిధిలా నగరంలో.. కృష్ణుడు జన్మించింది మథురలో.. రుక్మిణి పుట్టింది విదర్భలో.. ఇలా చాలామంది దేవీదేవతల పుట్టిన ప్రదేశాలు మనకు తెలుసు. మనుషుల్లాగా దేవుళ్లు ఫలానాచోట పుట్టారని చెప్పడానికి సర్టిఫికెట్లు, అధికారికి డాక్యుమెంట్లు ఉండవు. స్థలపురాణాలు, నమ్మకాలే ఆధారాలు. కానీ, రామాయాణం అలా కాదు.. రాముడి కథ నిజమైందేననీ, కల్పన కాదనీ కోట్ల మంది తరతరాలుగా నమ్ముతున్న నేల ఇది. భరత జాతి ఆరాధ్యదైవం.. అయోధ్య రాముడి జన్మస్థలంపై మనకు పూర్తి క్లారిటీ, విశ్వాసం వుంది. కానీ, ఆంజనేయుడి జన్మస్థలంపై ఇప్పటిదాకా పక్కా పౌరాణిక ఆధారాలు లభించలేదు. అయితే, హనుమంతుడి జన్మస్థానంపై తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా సంచలన ప్రకటన చేసింది. వాయుపుత్రుడు జన్మించింది తెలుగునేలపైనేనని చెబుతోంది. ఇందుకు పక్కా ఆధారాలున్నాయని కూడా స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ ఉగాది రోజున పురాణాలు, శాసనాలు, శాస్త్రీయ ఆధారాలతో సహా నిరూపించేందుకు టీటీడీ సిద్ధమైంది.  

హనుమంతుడు భారతీయుల ఆరాధ్యదైవం. రామాలయం, కృష్ణాలయం, శివాలయం లేకపోయినా.. దాదాపు ప్రతి ఊళ్లోనూ హనుమంతుడి గుడి మాత్రం ఉంటుంది. ఆంజనేయుడిని భారతీయులు ఎంతగా ఆరాధిస్తారో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది..? మరి, అలాంటి ఆంజనేయుడి జన్మస్థలంపై మనకు క్లారిటీ లేకపోవడం.. ఇబ్బందికర పరిణామమే కదా..! నిజానికి, హనుమంతుడి జన్మస్థానంపై రకరకాల కథనాలు వినిపిస్తున్నప్పటికీ వాటికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. అసలు ఆంజనేయుడి నిజమైన జన్మ ప్రదేశం ఏదో చెప్పుకునే ముందు.. ఇప్పటివరకు ప్రచారంలో వున్న ప్రదేశాల గురించి ఓసారి చర్చించుకుందాం.

ఇది ఆంజనేయ పర్వతం.. కర్నాటకలోని హంపిలో వున్న ఈ కొండపై ఆయనకో గుడి కూడా ఉంది. రామాయణం ప్రకారం కిష్కింధ అంటే.. తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతమనీ.. ఆ ప్రాంతం హంపీయేనని.. నేటి హంపీయే నాటి కిష్కింధ అని ప్రజలు నమ్ముతుంటారు. రామాయణంలో చెప్పబడిన రుష్యమూక పర్వతం కూడా ఇక్కడే ఉంది. ఒకప్పుడు ఇదంతా దండకారణ్యం. రాముడు వింధ్య పర్వతశ్రేణిని దాటి, సీతను అన్వేషిస్తూ కిష్కింధ వైపు వచ్చాడనేది రామాయణ గాథ. కిష్కంధ దక్షిణ భారత దేశంలోనే వుందని ప్రజల విశ్వాసం. అదే హనుమంతుడి జన్మస్థలమని నమ్ముతూవుంటారు. కానీ, కిష్కింధ కేవలం వాలి, సుగ్రీవుల రాజ్యమని, హనుమంతుడి జన్మస్థలం కిష్కింధ కాదనే వాదన కూడా వుంది. ఇలాగే, దేశంలో ఇంకా చాలా హనుమంతుడి జన్మస్థలంగా చెప్పుకుంటున్న ప్రదేశాలున్నాయి.

ఇది మహారాష్ట్రలోని నాసిక్. త్య్రంబకేశ్వరానికి ఆరేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అంజనేరి పర్వతం. ఇది కూడా హనుమంతుడి జన్మస్థలమని ప్రచారంలో వుంది. ఈ పర్వతంపైనే హనుమంతుడి తల్లి అంజనీదేవి తపస్సు చేసిందని అంటారు. ఇక్కడ కూడా హనుమంతుడికి ఓ ఆలయం ఉంది.

ఇది గుజరాత్.. దంగ్ జిల్లాలోని నవసారి ప్రాంతం. ఒకప్పుడు దీన్ని కూడా దండకారణ్యం అనేవారనీ. ఇక్కడున్న అంజనా పర్వతమే హనుమంతుడి జన్మస్థలమని ఆ ప్రాంత గిరిజనుల ప్రగాఢ విశ్వాసం. అక్కడ అంజనీ గుహ కూడా ఉంది. ఆ గుహలోనే అంజనీ దేవి వాయుపుత్రుడికి జన్మనిచ్చిందని చెబుతారు.

ఇక, ఇదేమో జార్ఖండ్ లోని గుమ్లా జిల్లాలోని అంజన్ అనే ఓ గ్రామం. ఈ గ్రామంలోనే హనుమంతుడు పుట్టాడని స్థానికులు నమ్ముతుంటారు. విశేషమేమిటంటే.. ఇక్కడ కూడా అంజనీదేవికి కూడా ఓ గుడి ఉంది. అసలు వాలి, సుగ్రీవుల రాజ్యం కూడా ఇదేనని అక్కడి ప్రజల నమ్మకం

ఇదేమో హర్యానాలోని కైతల్ పట్టణం. ఒకప్పుడు దీనిని కపితల్ అని పిలిచేవారు. కాలక్రమంలో అది కాస్తా కైతల్ గా మారిపోయివుంటుందని చెబుతారు. ఈ ప్రాంతాన్ని కపిరాజు కేసరి అనే రాజు పరిపాలించేవాడట. ఇక్కడే అంజనీదేవి హనుమంతుడికి జన్మనిచ్చిందనేది అక్కడి స్థలపురాణం.

ఇక, రాజస్థాన్‌, చురు జిల్లా, సుజన్ గఢ్ సమీపంలో వున్న లక్షక గుట్టలు కూడా హనుమంతుడి జన్మస్థలమనే నమ్ముతారు. అయితే, ఇవన్నీ కాదని.. అసలు ఆంజనేయుడు జన్మించింది తెలుగు నేలపైనేని శాస్త్రీయ ఆధారాలతో నిరూపించబోతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

తిరుమల గిరుల్లోని అంజ‌నాద్రి కొండ‌పైనే హనుమంతుడి జననం జరిగిందని ఘంటాపథంగా చెబుతోంది టీటీడీ. హ‌నుమంతుడు జ‌న్మించాడ‌నే విష‌యాన్ని ఆధారాల‌తో సహా నిరూపించేందుకు.. 2020 డిసెంబ‌రులో టీటీడీ పండితుల‌తో ఒక క‌మిటీని ఏర్పాటుచేసింది. టీటీడీ ఎస్వీ ఉన్న‌త వేదాధ్య‌య‌న సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ డా.ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో.. ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం వైస్ ఛాన్సిలర్ ఆచార్య స‌న్నిధానం సుదర్శ‌న‌ శ‌ర్మ‌, జాతీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యం వైస్ ఛాన్సిలర్ ఆచార్య ముర‌ళీధ‌ర శ‌ర్మ‌, ఆచార్య రాణి స‌దాశివ‌మూర్తి, ఆచార్య జాన‌మ‌ద్ది రామ‌కృష్ణ‌, ఆచార్య శంక‌ర‌నారాయ‌ణ‌, ఇస్రో శాస్త్రవేత్త రేమెళ్ల మూర్తి, రాష్ట్ర పురావ‌స్తు శాఖ డిప్యూటీ డైరెక్ట‌ర్ విజ‌య్‌కుమార్ స‌భ్యులుగా ఉన్నారు. హనుమంతుడి జన్మస్థలంపై క‌మిటీలోని పండితులు ప‌లుమార్లు స‌మావేశమై లోతుగా ప‌రిశోధ‌న చేశారు. అంజనీపుత్రుడు అంజ‌నాద్రిలోనే జ‌న్మించాడ‌ని రుజువు చేసేందుకు బ‌ల‌మైన ఆధారాలను సేక‌రించారు. శివ‌, బ్ర‌హ్మ‌, బ్ర‌హ్మాండ‌, వ‌రాహ‌, మ‌త్స్య పురాణాలు, వేంక‌టాచ‌ల మ‌హ‌త్యం గ్రంథం, వ‌రాహ‌మిహిరుని బృహ‌త్‌సంహిత గ్రంథాల ప్ర‌కారం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి చెంత గల అంజ‌నాద్రి కొండే ఆంజ‌నేయుని జ‌న్మ‌స్థాన‌మ‌ని యుగం ప్ర‌కారం, తేదీ ప్ర‌కారం నిర్ధారణకు వచ్చారు.

ఇక, ఇటీవల కమిటీ సభ్యులతో టీటీడీ ఈవో డాక్ట‌ర్ కేఎస్‌ జవహర్‌ రెడ్డి ఇటీవల సుదీర్ఘంగా స‌మీక్ష జరిపారు. ఈ సంద‌ర్భంగా.. హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రి పర్వతమేనని ప్రకటించారు. క‌మిటీలోని పండితులు జ్యోతిష శాస్త్రం, శాస‌నాలు, పురాణాలు, శాస్త్రీయ ఆధారాల‌తో ఉగాది రోజున ఈ విషయాన్ని ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తారన్నారు. హ‌నుమంతుడి జ‌న్మ‌స్థానం అంజనాద్రి అని నిరూపించేందుకు ఉన్న ఆధారాలు, ఇత‌ర వివ‌రాల‌తో త్వ‌ర‌లో స‌మ‌గ్ర‌మైన పుస్త‌కాన్ని తీసుకొస్తున్నట్టు కూడా తెలిపారు.

అదన్నమాట అసలు సంగతి. మొత్తానికి, టీటీడీ పరిశోధనతో హనుమంతుడి జన్మస్థలంపై యుగయుగాలుగా వున్న అనుమానాలన్నీ పటాపంచలు కాబోతున్నాయి. ఇప్పుడు టీటీడీ ఇవ్వబోతున్న క్లారిటీతో ఏడుకొండల్లోని అంజనాద్రి పర్వతమే హనుమంతుడి నిజమైన జన్మస్థలంగా స్థిరపడనుంది. అదే జరిగితే భారతీయ చరిత్రలో ఇదో మైలురాయిగా నిలబడిపోతుంది. టీటీడీ చెబుతున్న సత్యాన్ని ఊరికే కొట్టిపారేయలేం. ఎందుకంటే, ఎన్నో పురాణేతిహాసాలను, శాస్త్రీయ గ్రంథాలను పరిశీలించడమే కాకుండా.. పురావస్తు, అంతరిక్ష పరిశోధనా సంస్థల నిపుణుల చేత శాస్త్రీయంగా అధ్యయనం చేయించిన తర్వాత.. అత్యంత కచ్చితత్వంతో టీటీడీ ఇస్తున్న క్లారిటీ ఇది. సో.. ఇకపై తిరుమల ఏడుకొండవాడికే కాదు.. ఆయన నమ్మినబంటు ఆంజనేయుడికి కూడా కేరాఫ్ అడ్రస్ అన్నమాట. ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రి పర్వతమేనని.. దీనిని అర్జెంటుగా అధికారికంగా ప్రకటించి.. టీటీడీయే అక్కడ ఆయనకో భవ్యమందిరాన్ని నిర్మించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

16 − 11 =