ది కశ్మీర్ ఫైల్స్ సినిమా చూడడానికి హాఫ్ డే లీవ్ మంజూరు చేయనున్న ప్రభుత్వం

0
895

‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషించారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు ఈ చిత్రంపై వినోద‌పు ప‌న్నును తొలగించాయి. ఇప్పుడు అస్సాం ప్ర‌భుత్వం ఓ కీలక నిర్ణ‌యం తీసుకుంది. ఈ చిత్రం చూసేందుకు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు హాప్ డే సెల‌వును ప్ర‌క‌టించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తన క్యాబినెట్ సహచరులతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించారు. 1990లలో లోయ నుండి కశ్మీరీ పండిట్ల వలసల ఆధారంగా రూపొందించిన “ది కశ్మీర్ ఫైల్స్” చిత్రాన్ని చూడటానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సగం రోజుల సెలవును పొందవచ్చని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మంగళవారం ప్రకటించారు. “మా ప్రభుత్వ ఉద్యోగులు TheKashmirFiles చూడటానికి హాఫ్-డే స్పెషల్ లీవ్‌కు అర్హులని ప్రకటించినందుకు సంతోషిస్తున్నాము. వారు తమ పై అధికారులకు ఈ విషయాన్నీ తెలియజేయాలి. మరుసటి రోజు టికెట్ లను సమర్పించాలి” అని హిమంత బిస్వా శర్మ చెప్పారు.

ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, తన క్యాబినెట్ మొత్తంతో కలిసి గౌహతిలోని ఒక థియేటర్‌లో సినిమాను వీక్షించారు. కశ్మీరీ పండిట్ల మారణహోమం మానవత్వానికి మచ్చ అని ఆయన అన్నారు. “కశ్మీరీ పండిట్ మారణహోమం, వారి వలసలు మానవాళికి మచ్చ. #TheKashmirFilesలో వారి దుస్థితిని హృదయ విదారకంగా చిత్రీకరించడం ద్వారా ప్రతి ఒక్కరి మది కదిలించబడింది, ఈ సినిమాను నా క్యాబినెట్ సహచరులు, మిత్రపక్షాల ఎమ్మెల్యేలతో కలిసి నేను చలనచిత్రాన్ని వీక్షించాను” అని శ్రీ శర్మ చెప్పారు.

ఈ సినిమాలో కశ్మీరీ పండిట్ల బాధను చూపించారు. సినిమా చూసిన ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమాకి క్రేజ్ పెరగడంతో తొలి రోజు 600 స్క్రీన్లలో విడుదలైన ది కాశ్మీరీ ఫైల్స్.. ఇప్పుడు ఏకంగా 2000 స్క్రీన్లలో ప్రదర్శించబడుతోంది. మంగళవారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. నిజాన్ని సరైన రూపంలోకి తీసుకువచ్చారని ప్రశంసించారు. చరిత్రను ప్రజలకు తెలియజేయాలని అన్నారు.