International

దేశ ప్రెసిడెంట్ ను అతి కిరాతకంగా హత్య చేశారు

హైతీ దేశంలో ఘోరం చోటు చేసుకుంది. ఆ దేశ అధ్యక్షుడు జొవెనెల్ మోస్ ను అతి కిరాతంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశ తాత్కాలిక ప్రధానమంత్రి జోసెఫ్ వెల్లడించారు. హైతీ అధ్యక్షుడు జొవెనెల్‌ మోయిస్‌ (53)ను స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అధ్యక్షుడి ప్రయివేటు నివాసంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రథమ మహిళ, జొవెనెల్ భార్య మార్టినే మోయిస్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

అధ్యక్షుడి హత్యను తాత్కాలిక ప్రధాని క్లాడ్‌ జోసెఫ్‌ ధ్రువీకరించారు. ‘సాయుధ కమాండో గ్రూపు’ సభ్యులే ఇందుకు కారణమని ఆయన ఆరోపించారు. గుర్తుతెలియని కొందరు సాయుధులు రాజధాని పోర్ట్‌ ఆఫ్‌ ప్రిన్స్‌ అధ్యక్షుడి నివాసంలోకి చొరబడ్డారని.. ఈ హత్యలో విదేశీ వ్యక్తుల ప్రమేయం ఉందని ప్రధాని ప్రకటనలో ఉంది. ఇంగ్లిష్‌, స్పానిష్‌ భాషలు మాట్లాడిన విదేశీయులే ఘాతుకానికి పాల్పడినట్టు తెలిపారు. ఇది ‘విద్వేషపూరితం, అమానుషం, ఆటవికం’ అని చెప్పారు. ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలను కూడా తానే నిర్వహించనున్నట్టు ప్రకటించారు. దేశంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తాత్కాలిక ప్రధానమంత్రి జోసెఫ్ చెప్పారు. దేశంలో భద్రతా పరిస్థితి హైతియన్ నేషనల్ పోలీస్, హైతియన్ సాయుధ దళాల నియంత్రణలో ఉంది దేశాన్ని రక్షించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పుకొచ్చారు.

వ్యాపారవేత్త అయిన మోయిస్‌ 2015లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. దేశాన్ని పునర్నిర్మిస్తానంటూ హామీలు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో మోయిస్ విజయం సాధించినా ఆయన అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రజాందోళనలు జరిగాయి. 2016లో జరిగిన రెండో రౌండు ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించినా.. నిరసనలు వెల్లువెత్తాయి. కోర్టు తీర్పుతో ఆయన 2017 ఫిబ్రవరిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 2017 ఫిబ్రవరి నుంచి జొవెనెల్ మోస్ హైతీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆయనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. జొవెనెల్ పదవి కాలం 2021 ఫిబ్రవరిలోనే ముగిసిందని, వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని హైతీ విపక్షాలు డిమాండ్ చేశాయి. తన పదవి కాలం మరో ఏడాది ఉందంటూ ఆయన గద్దె దిగడానికి నిరాకరించారు. ఇంతలోనే ఆయన్ను హత్య చేశారు. అధ్యక్షుడు జొవెనెల్ మోయిస్ హత్యకు పాల్పడిన నలుగురి అనుమానితుల్లో ఇద్దర్ని పోలీసులు కాల్చి చంపినట్టు హైతీ పోలీస్ చీఫ్ తెలిపారు. మరో ఇద్దర్ని అరెస్ట్ చేసినట్టు తెలిపారు.

కరేబియన్ దేశాల్లో అత్యంత పేదరిక దేశం హైతీ. నిరంకుశత్వం, రాజకీయ అస్థిరత కారణంగా పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయి. రాజధాని పోర్ట్‌ ఆఫ్‌ ప్రిన్స్‌ సహా పలు చోట్ల సాయుధ ముఠాలు రాజ్యం ఏలుతూ ఉన్నాయి. ముఠాలు పోలీసులకు మధ్య కూడా ఎన్నోసార్లు ఘర్షణ వాతావరణం నెలకొంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

11 − five =

Back to top button