More

  తీర్పు సంచలనం..! RSS సంయమనం..!! జ్ఞానవాపి రహస్యం..

  జ్ఞానవాపీ కేసులో వారణాసీ జిల్లా న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. శివలింగానికి శాస్త్రీయ పరిశోధనపై ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ‘కార్బన్ డేటింగ్’ కు అనుమతి నిరాకరిస్తూ తీర్పు వెలువరించింది.  ‘శివలింగం’ వయసు, దాని స్వభావాలను నిర్థారించాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను ఆదేశించడం సరైంది కాదని తెలిపింది. జ్ఞానవాపీ కేసు   Places of Worship (Special Provisions) Act, 1991 పరిధిలోకి రాదని కూడా న్యాయస్థానం తేల్చి చెప్పింది. కార్బన్ డేటింగ్ ఆచరణ సాధ్యం కాదని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ వాదించింది.

  రాయికి కార్బన్ డేటింగ్ చేయడం సాధ్యం కాదని పేర్కొంది. రాయి అంటే ఆర్గానిక్ పదార్థం కాదని తెలిపింది. మే 17న సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను వారణాసీ జిల్లా కోర్టు ఊటంకించింది. శాస్త్రీయ పరీక్షలకు అంగీకరిస్తే ‘శివలింగం ఉన్న స్థలాన్ని కాపాడాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించడమే అవుతుందని న్యాయస్థానం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. 

  శాస్త్రీయ పరిశీలన ద్వారా శివలింగం నమూనాలు బయటపడతాయని హిందూ సంఘాలు వాదించినా న్యాయమూర్తి సదరు వాదనలతో సమ్మతించలేదు. ఇక తాజా తీర్పుపై స్పందించిన పిటిషనర్ల తరపు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ తాము ఆర్డర్ కాపీ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. హైకోర్టుకు వెళ్లే అవకాశం మాకు అందుబాటులో ఉందనీ… పిటిషనర్ల అభిప్రాయాన్ని హైకోర్టు ముందుంచుతామన్నారు.

  జ్ఞాన్​ వాపి కేసు తీర్పు నిజంగానే హిందూ సంఘాలకు చెంపపెట్టుగా భావించాలా? రాబోయే రోజుల్లో యూపీ హైకోర్టు ఆ తర్వాత సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే వచ్చే తీర్పులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది?  జ్ఞాన్​ వాపి  విషయంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లు ఏమనుకుంటున్నాయి? జ్ఞాన్​ వాపి  కేసులో తీర్పు ఎలా ఉంటుందో హిందూ సంఘాలు ముందే ఊహించాయా? జ్ఞాన్​ వాపి  కేసు నేపథ్యం ఏంటి? ఆరెస్సెస్ మైనారిటీ సెల్ కన్వినర్ ఇంద్రేష్ కుమార్ ప్రకటన అంతరార్థం ఏంటి?

  ఈ ప్రశ్నలకు జవాబు వెతికే ప్రయత్నం చేద్దాం….

  జ్ఞాన్​ వాపి  మసీదులో పూజలకు అనుమతించాలని హిందువులు దాఖలు చేసిన పిటిషన్‌పై గతంలో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సర్వోన్నత న్యాయస్థానం కేసు విచారణను వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేసంది. యూపీ  న్యాయ విభాగానికి సంబంధించిన సీనియర్​, అనుభవజ్ఞులైన జ్యుడీషియల్​ అధికారి ఈ కేసును విచారించాలని ఆదేశించింది. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని సివిల్​ జడ్జ్​  నుంచి కేసును వారణాసి జిల్లా​ జడ్జికి బదిలీ చేసినట్లు జస్టిస్​ డీవై చంద్రచూడ్​ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం తెలిపింది.

  జ్ఞాన్‌వాపి మసీదు వెలుపలి గోడపై ఉన్నదేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఐదుగురు మహిళలు గతేడాది సెప్టెంబర్ 12న పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన వారణాసి కోర్టు.. మసీదు ప్రాంగణంలో వీడియోగ్రఫీ సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మసీదు ప్రాంగణంలో ఈ ఏడాది మే 14 నుంచి 16 వరకు కమిషన్ వీడియోగ్రఫీ సర్వే నిర్వహించింది. ప్రార్థన స్థలంలోని  నేలమాళిగలు, చెరువు, మూడు గోపురాలను సర్వే బృందం వీడియో తీసింది. 

  వీడియోగ్రఫీ సర్వే సందర్భంగా మసీదులోని వజూఖానా-కొలను వద్ద 12.8 అడుగుల పొడవైన శివలింగం కనిపించిందని హిందూ పిటిషనర్లు వారణాసి జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీంతో శివలింగం కనిపించిందని చెబుతున్న ప్రాంతాన్ని సీల్‌ చేయాల్సిందిగా సంబంధిక అధికారులను జడ్జీ ఆదేశించారు. అయితే వీడియో గ్రఫీ తీస్తుండగా అక్కడ కనిపించింది శివలింగం కాదని, అది ఫౌంటెయిన్‌లో భాగమని ముస్లిం తరపు పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. దీంతో  జ్ఞాననాపి మసీదులో శివలింగం దొరికిందని చెబుతున్న ప్రాంతానికి తగిన రక్షణ కల్పించాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముస్లింలు ఆ మసీదులో ప్రార్థనలు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.

  ఈ తీర్పును వెలువరించేటప్పుడు జడ్జి ‘అజయ్ కృష్ణ విశ్వేష’ చేసిన వ్యాఖ్యలు గమనించదగ్గవి. శాస్త్రీయ పరిశోధన వల్ల శివలంగం పాక్షికంగా ధ్వంసం అయ్యే అవకాశముందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఒకవేళ అది నిజంగానే శివలింగమే అయితే మూర్తి ధ్వంసమైనప్పుడు హిందువుల మనోభావాలను దెబ్బతింటాయన్నారు. ఈ కారణాలతోనే హిందూ సంఘాలు దాఖలు చేసిన కార్బన్ డేటింగ్ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు జడ్జి అజయ్ కృష్ణ విశ్వేష తీర్పులో పేర్కొన్నారు. అయితే ఈ తీర్పు హిందూ సంఘాలకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ తదుపరి విచారణకు ఏమాత్రం ఆటంకం కాబోదంటారు న్యాయనిపుణులు.  గతంలో వీడియోగ్రఫీ సర్వేలో దేవాలయ ప్రాకారాలపై  హిందూ దేవీదేవతల ఆకారాలు బయటపడిన కారణంగా మరోసారి హిందూ సంఘాలు ఉత్తర ప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

  వారణాసీ జిల్లా న్యాయస్థానం ఇచ్చిన తాజా తీర్పుతో జ్ఞానవాపీ కేసులో అనిశ్చితి నెలకొందనే భావన అంతటా విస్తరించింది. నిజానికి ఇందులో ఎలాంటి అనిశ్చితికి తావులేదు. అయోధ్య తీర్పునకు భిన్నమైన జ్ఞానవాపీ కేసులో తీర్పు ఇదే తరహాలో ఉంటుందని న్యాయ నిపుణులు గతంలోనే తేల్చి చెప్పారు. జిల్లా కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఉత్తర ప్రదేశ్ హైకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేసుకుంటే…అప్పుడు కూడా రమారమి ఇదే తరహాలో తీర్పు వచ్చే అవకాశాలున్నాయంటారు న్యాయ నిపుణులు. ఆ తర్వాత సుప్రీం కోర్టులో ఈ కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. అయితే సర్వోన్నత న్యాయస్థానం కూడా ధార్మిక అంశాల విషయంలో పూర్తిగా స్పష్టమైన, ఖచ్చితమైన తీర్పులు వెలువరించే అవకాశం లేదు. గతంలోనూ జరిగిన సందర్భాలు లేవు. న్యాయస్థానం వెలుపల పరస్పర సమ్మతితో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించే అవకాశాలే ఎక్కువ.

  అటు కేంద్రంలోనూ, ఇటు ఉత్తర ప్రదేశ్ లోనూ అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ, రాష్ట్రీ స్వయం సేవక్ సంఘ్ లు సైతం జ్ఞాన్ వాపీ విషయంలో అనవసర హడావిడి సృష్టించకూడదన్న నిర్ణయంతో ఉన్నట్టూ తాజా పరిణామాలను చూస్తుంటే అర్థమవుతుంది. జాప్యం జరిగినా సరే సామాజిక సమ్మతి లేకుండా తొందపాటు నిర్ణయాల వల్ల నష్టం తీవ్రంగా ఉంటుందని బీజేపీ భావిస్తోంది. అనుకూల వాతావరణాన్ని సృష్టించే వరకూ  జ్ఞాన్ వాపీ అంశం న్యాయస్థానాల్లో నలిగితేనే మంచిదని బీజేపీ అనుకుంటోంది. దీని వల్ల ఈ అంశం ప్రజల్లోకి చొచ్చుకుపోతుందని కూడా ఆ పార్టీ భావిస్తోంది.

   జ్ఞానవాపీ కేసులో చివరికి ఏం జరిగే అవకాశం ఉంది?

  హైకోర్టు, సుప్రీం కోర్టు తీర్పుల తర్వాత దేశంలో పెద్ద ఎత్తున చర్చ మొదలవుతుంది. పైగా మసీదు శివలింగం ఉండటం, అందులోనూ వజూఖానా-నమాజ్ కు ముందు కాళ్లూ చేతులూ కడుక్కునే ప్రదేశంలో శివలింగం ఉండటాన్ని దేశంలోని హిందూ భక్తులు జీర్ణించుకోవడం కష్టం కాబట్టి…ఒక అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. యూపీలోని ముస్లీం సంఘాలతో చర్చలు జరిపి…ఒప్పించి…చివరకు జ్ఞానవాపీ మందిరానికి జీర్ణోద్ధరణ చేసే అవకాశం ఉంది. ఇదంతా ఒక రోజులో జరిగేది కాదు. న్యాయసంబంధమైన చిక్కులు వీడే వరకూ తొందర పడకూడదని హిందూ సంఘాలు భావిస్తున్నట్టూ అర్థమవుతోంది.

  హిందూ సంఘాలు తాజా తీర్పును ఆధారం చేసుకుని అలహాబాద్ హైకోర్టుకు వెళ్లే అవకాశాలు బలంగా ఉన్నాయి. హైకోర్టు తీర్పు తర్వాత యూపీలో జ్ఞానవాపి విషయంలో సమ్మతి సృష్టి జరిగే అవకాశాలున్నాయి. సున్నీ వక్ఫ్ బోర్డు లాంటి సంస్థలతో సంప్రదింపులు జరిపి ఆ తర్వాత హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేసే ఛాన్స్ ఉంది. ఈ క్రమం కొనసాగుతుండగానే హిందూ-ముస్లీం సంఘాల మధ్య సయోధ్య కుదిరే అవకాశం ఉంది. వారణాసీ జిల్లా కోర్టు తీర్పు వెలువడిన వెంటనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్పందన చూస్తే…ఆ సంస్థకు ఉన్న దూరదృష్టి అర్థమవుతుంది. ‘Don’t Get Provoked…Maintain Calm,’ Says RSS After Gyanvapi ‘Shivling’ Carbon Dating’’ ఆరెస్సెస్ మైనారిటీ సెల్ కన్వినర్ ఇంద్రేష్ కుమార్ ప్రకటించారు. ‘‘…maintain calm. Be patient and make continuous efforts, the truth will eventually come out’’ అని వ్యాఖ్యానించారు. సహనంతో ఉండాలనీ, సత్యం బయటకు వస్తుందని ఆరెస్సెస్ విస్పష్టమైన ప్రకటన చేసిందంటే…అందుకు తగిన ప్రణాళిక తప్పక ఉందంటారు పరిశీలకులు.

  Trending Stories

  Related Stories