జ్క్షానవాపి మసీదు లోపల సర్వే.. తీర్పు ఏమొస్తుందోననే ఉత్కంఠ

0
863

కాశీ విశ్వనాథ దేవాలయం పక్కన ఉన్న జ్క్షానవాపి మసీదు లోపల సర్వే జరగవచ్చా? లేదా అనే విషయమై వారణాసి కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. వారణాసిలోని జ్క్షానవాపి మసీదు సముదాయం పశ్చిమ గోడ వెనుక ఉన్న హిందూ మందిరంలో ప్రార్థన చేయడానికి అనుమతి కోరుతూ ఐదుగురు హిందూ మహిళలు వేసిన పిటిషన్‌పై ఈ ఏడాది ఏప్రిల్‌లో కోర్టు ఇన్స్పెక్షన్ కు ఆదేశించింది. ఈ ప్రాంతం ప్రస్తుతం సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రార్థనల కోసం తెరవబడుతోంది. మొత్తం జ్ఞానవాపి మసీదు అంతటా ఆర్కియోలాజికాల్ సర్వే కోసం ఆదేశించాలని.. జ్ఞానవాపి కాంప్లెక్స్ లో హిందు దేవతల ఆరాధనకు అనుమతించాలని కోరారు. అయితే మే 10వ తేదీలోగా నివేదిక సమర్పించాలని స్థానిక కోర్టు గతంలో అధికారులను ఆదేశించింది.

సర్వే గత శుక్రవారం ప్రారంభమైనప్పటికీ.. మసీదు లోపల వీడియోగ్రఫీ తీయరాదని అడ్డుకున్నారు. జ్ఞానవాపి మసీదు కేర్‌టేకర్ కమిటీ మసీదు లోపల ఎలాంటి వీడియోగ్రఫీని వ్యతిరేకించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తమకు కోర్టు అనుమతి ఉందని పేర్కొన్నారు. సర్వేను పర్యవేక్షిస్తున్న కమిషనర్‌ను మార్చాలా, మసీదు లోపల వీడియోగ్రఫీని అనుమతించాలా వద్దా అనే విషయాన్ని కూడా కోర్టు నేడు నిర్ణయించనుంది.

కాశీలోని విశ్వనాథ ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదులో సర్వే చేయడం వివాదాస్పదంగా మారింది. స్థానిక కోర్టు ఆదేశాల మేరకు “శృంగార్‌ గౌరీ స్థల్‌” పునాదులపై సర్వేలో భాగంగా జ్ఞానవాపి మసీదులో వీడీయోగ్రఫీ నిర్వహించారు. అయితే అన్యమతస్తులు మసీదులోకి రాకూడదంటూ స్థానిక ముస్లింలు వ్యతిరేకించారు. కోర్టు సర్వే చేయాలని ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని జ్ఞానవాపి మసీదు నిర్వాహకులు చెబుతున్నారు. పరిశీలన కోసమే వెళ్లాలని సూచించినట్టు తెలిపారు. కాశీ జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న శృంగార్‌ గౌరీ తదితర ప్రతిమలకు పూజలు చేసుకోవడానికి అనుమతించాలని మహిళలు కోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మే 10 లోగా సర్వే చేసి నివేదిక ఇవ్వాలని వారణాసి సెషన్స్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాశీ -జ్క్షానవాపి మసీదు వివాదం 1991 నుంచి కోర్టులొ నడుస్తోంది. అలహాబాద్‌ హైకోర్టులో దీనిపై విచారణ జరుగుతోంది. కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకుని జ్ఞానవాపి మసీదు ఉంది. నిజానికి అది కూడా కాశీ విశ్వనాథుని ఆలయానికి సంబంధించినదేనన్న వాదన ఉంది. 17వ శతాబ్దంలో ఔరంగజేబు ఆదేశాల మేరకు కాశీ విశ్వనాథుని ఆలయం కొంత భాగాన్ని ధ్వంసం చేసి మసీదు నిర్మించినట్టు అర్చకులు 1991లోనే వారణాసి డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్లు వేశారు. గతంలో మసీదు గోడల బయటివైపు ప్రాచీన కాలం నాటి రెండు స్వస్తిక్ గుర్తులు వెలుగు చూశాయి. విగ్రహాల యొక్క అవశేషాలు, చెక్కిన హిందూ దేవతల విగ్రహాల మాదిరి రాళ్లను గుర్తించారు. దీంతో హిందూ ఆలయ నమూనాలను చెరిపేసే ప్రయత్నం జరుగుతోందని హిందూ సంఘాలు ఆరోపిస్తూ ఉన్నారు.