విశాఖలో ప్రధాని మోదీ కార్యక్రమాల్లో మరో రెండు పథకాలు చేరాయి. నిన్న ఏడు కార్యక్రమాలతో పర్యటన వివరాలు అందించగా.. అదనంగా మరో రెండు కార్యక్రమాలను జోడించారు. విశాఖ ఎన్ఎడి సమీపంలో పాత ఐటిఐ నుంచి కంచరపాలెం మెట్టు వరకూ మోదీ రోడ్ షో నిర్వహిస్తారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో ప్రధాని పర్యటన తాజా విశేషాలు రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశాఖ పర్యటనలో తొమ్మిది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. మోదీ పర్యటన సందర్భంగా ఇదే అజెండా అని.. వేరే అజండా ఏమీ లేదన్నారు. ఇవి కాకుండా.. ఎవరు ఏమైనా ప్రచారం చేసుకుంటే తమకు సంబంధం లేదన్నారు. రైల్వే జోన్ శంకుస్థాపన ఈ రోజు వరకు లేదని, అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే ప్రధాని వస్తున్నారని స్పష్టం చేశారు. చిన్న చిన్న విషయాలను రాజకీయం చేయొద్దన్నారు. అభివృద్ధి అజెండాగానే ప్రధాని మోదీ పర్యటన ఉంటుందని జీవీఎల్ స్పష్టం చేశారు.