More

    పోలవరం నిర్వాసితుల‌కు న్యాయం జరిగేలా బీజేపీ ఉద్యమం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. పోలవరం నిర్వాసితుల కోసం పోరాటం చేయడానికి సిద్ధమవుతూ ఉంది. ఎంతో మంది పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇళ్లు ఇచ్చారు. వారిలో చాలా మందికి ఇప్పటికీ ఉపాధి దక్కలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇళ్లు ప్ర‌భుత్వానికి ఇచ్చేసిన వాళ్లకు న్యాయం జరగాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. భారతీయ జనతా పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధ్య‌క్షుడు సోము వీర్రాజు పోలవరం నిర్వాసితుల‌ను పరామర్శించారు. వారి నుంచి విన‌తి ప‌త్రాల‌ను తీసుకున్నట్లు ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వాసితుల‌కు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఆయన ట్వీట్లు చేశారు. ‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 70 శాతం పూర్తయిందని ఎలాగయితే గొప్పగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటున్నదో, అంతకంటే గొప్పగా ప్రాజెక్టు కోసం తమ ఇళ్లు, భూములు అన్నీ వదిలేసిన ముంపు ప్రాంత ప్రజలకు సరైన న్యాయం చేయాలి. దీనిపై కూడా దృష్టి సారించి, క‌చ్చితమైన ఉపాధి, పునరావాసాలను కల్పించి, వారి హక్కుగా ఇవ్వవలసిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీని కూడా ప్రాజెక్టుతో సమానంగా 70 శాతం పూర్తి చేయాలని బీజేపీ ఏపీ డిమాండ్ చేస్తోంది’ అని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. పోలవరం ముంపు ప్రాంత వాసులతో కలిసి భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేపడుతుందని వెల్లడించారు. ‘ఈ విషయంలో నిర్లక్ష్యం వహించి, ఆలస్యం చేస్తే ముంపు ప్రాంత వాసులతో కలిసి భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని చేపడుతుందని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ గారి ప్రభుత్వాన్ని పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తోంది’ అని సోము వీర్రాజు తెలిపారు.

    బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. వైసీపీ, టీడీపీ రెండూ రెండేనని.. పారదర్శకత లేని పీడీ ఖాతాల ద్వారా వైసీపీ ప్రభుత్వం రూ.41 వేల కోట్లను మళ్లించగా గతంలో టీడీపీ కూడా రూ.53 వేల కోట్లను పీడీ ఖాతాల్లోకి మళ్లించిందని ఆరోపించారు. ప్రభుత్వాలు మారినా పీడీ పేరుతో దోపిడీ కొనసాగుతోందని విమర్శించారు. ఏపీలో రూ.లక్ష కోట్ల పీడీ ఖాతాల వ్యవహారంపై గవర్నర్ విచారణ జరపాలని కోరారు. ఇవి పీడీ ఖాతాలా? లేక దోపిడీ ఖాతాలా? అని ప్రజల్లో ఆందోళన ఉందని, దీనిపై నిగ్గు తేల్చాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు లేఖ రాశారు. వైసీపీ సర్కారు రూ.41 వేల కోట్లకు సంబంధించి పారదర్శకత లేకుండా వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేసినట్టు కాగ్ తన తాజా నివేదికలో వెల్లడించిందని జీవీఎల్ తెలిపారు. గతంలో టీడీపీ సర్కారు రూ.53 వేల కోట్లకు పైగా పీడీ ఖాతాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేసినట్టు 2016-17 నాటి కాగ్ రిపోర్టు చెబుతోందని వివరించారు. కేవలం అత్యవసర పరిస్థితుల్లోనే అధికారులు వినియోగించడానికి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ పీడీ ఖాతాలు (పర్సనల్ డిపాజిట్ అకౌంట్స్) అని వివరించారు. పీడీ ఖాతాలపై వచ్చిన అభియోగాల మీద విస్తృతస్థాయి విచారణ జరపాల్సిన అవసరం ఉందని జీవీఎల్ చెప్పుకొచ్చారు.

    Trending Stories

    Related Stories