మా గ్రామంలో చర్చి ఒద్దు..!

0
803

మతమార్పిడులపై ఆ గ్రామం యుద్ధం ప్రకటించింది. హిందూ కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్న.. క్రైస్తవ మిషనరీలపై కన్నెర్రజేసింది. తమ స్వార్థం కోసం హిందూ కుటుంబాలను నిట్టనిలువునా చీల్చుతున్న పాస్టర్ల వెన్నులో వణుకుపుట్టించింది. చర్చిల మతోన్మాదాన్ని చీల్చిచెండాడి.. దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇంతకీ మతమార్పిడులను అడ్డుకోవడానికి ఆ గ్రామస్తులు ఏం చేశారు..? గ్రామ సభ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది..? ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుంది..?

క్రిస్టియన్ మిషనరీల విషవలయంలో చిక్కకుండా తనను తాను రక్షించుకున్న ఆ గ్రామం పేరు గురజాల. ఆంధ్రప్రదేశ్‎లోని కర్నూలు జిల్లాలో వున్న గురజాల.. మతమార్పిడులకు వ్యతిరేకంగా స్వచ్ఛంద ముందుకు కదిలింది. గ్రామంలోని దళితులు.. క్రిస్టియన్ మిషనరీల పట్ల ఆకర్షితులు కాకుండా.. బలవంతపు మతమార్పిడులకు గురికాకుండా.. గ్రామస్తులంతా కలిసి కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. గురజాల గ్రామంలో ‘ఇంటర్నేషనల్ మిషన్ బోర్డు’ సంస్థ.. విదేశీ నిధులతో ఓ చర్చిని నిర్మించి.. మతమార్పిడులను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో, క్రైస్తవ మతంలోకి మారిన కొందరు గ్రామస్తులు.. ఇటీవల చర్చిని మరింత విస్తరించాలని చూశారు. ఇందులో భాగంగా చట్టవిరుద్ధంగా ప్రహరీ గోడ నిర్మించేందుకు సిద్ధమయ్యారు. అయితే, ప్రహరీ గోడ నిర్మిస్తే, పక్కనే వున్న శివాలయంలో జరిగే పూజాకార్యక్రమాలు, వేడుకలకు ఇబ్బందికరంగా మారుతుండటంతో గ్రామస్తులు దీనిని అడ్డుకున్నారు. శివరాత్రి, ఉగాది, ఇతర పండుగల సందర్భంగా.. ప్రస్తుతం చర్చి వున్న దారిగుండా రథయాత్ర జరుగుతుంది. అంతేకాదు, పర్వదినాల సమయంలో ఈ ప్రాంతంలోనే గ్రామస్తులు పెద్దయెత్తున స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రహరీ గోడ నిర్మిస్తే.. వీటన్నింటికీ ఆటంకం కలుగుతుంది. అందుకే అక్రమ నిర్మాణం విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని గ్రామస్తులు తెలిపారు.

మొత్తానికి, ప్రహరీ గోడ నిర్మాణానికి అడ్డుచెప్పడమే కాకుండా.. గ్రామంలో క్రిస్టియన్ మిషనరీల ఆగడాలకు తెరదించింది గురజాల గ్రామం. గ్రామస్తులంతా కలిసి మతమార్పిడులకు వ్యతిరేకంగా ఐదు తీర్మానాలు చేసుకున్నారు. వీటిలో మొదటిది.. విదేశీ నిధులతో ‘ఇంటర్నేషనల్ మిషన్ బోర్డు’ గ్రామంలో అక్రమంగా నిర్మించి చర్చిని తొలగించడం. రెండు.. గ్రామంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల సంఖ్యను అధికారికంగా ప్రభుత్వం రికార్డుల్లో నమోదు చేయడం. మూడు.. క్రైస్తవ మతం స్వీకరించిన వ్యక్తులకు BC-C సర్టిఫికెట్లు ఇచ్చేలా.. రెవిన్యూ అధికారులను కోరడం. తద్వారా నిజమైన దళితుల రిజర్వేషన్లను కాపాడటం. ఇక, కనీసం 51 శాతం మెజారిటీతో గ్రామ సభ ఆమోదించకుండా.. గ్రామంలో ఎలాంటి మత నిర్మాణాలను చేపట్టరాదనేది నాలుగో తీర్మానం. గ్రామంలో జరిగే అన్ని సామాజిక, సాంస్కృతిక ఉత్సవాలు, దేవాలయాల కార్యకలాపాల్లో దళితులకు ప్రాధాన్యత ఇవ్వాలనేది ఐదవ తీర్మానం.

గురజాల గ్రామసభ కేవలం తీర్మానాలకు మాత్రమే పరిమితం కాలేదు. బలవంతపు మతమార్పిడుల ప్రమాదాన్ని గుర్తించిన గురజాల గ్రామస్తులు.. ఏకంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‎కు లేఖ రాశారు. దళితులను మతం మార్చడానికి ‘ఇంటర్నేషనల్ మిషన్ బోర్డు’ గ్రామంలో అక్రమంగా నిర్మించిన చర్చిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాదు, మత మార్పిడుల నుంచి తమ గ్రామాన్ని రక్షించుకోవడమే కాకుండా.. చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ క్రిస్టియన్ మిషనరీల ఆగడాలకు చెక్ పెడుతోంది గురజాల గ్రామం.

ఇదిలావుంటే, గురజాల గ్రామస్తుల ఫిర్యాదుపై స్పందించిన స్థానిక ఎంపీడీవో.. అక్రమ చర్చి విస్తరణ పనులను ఆపివేయాలంటూ ఆదేశాలు జారీచేశారు. ప్రహరీ నిర్మాణం వల్ల 10 అడుగుల భూమి ఆక్రమణకు గురవుతోందని.. ఇది నిరంకుశత్వ, చట్టవిరుద్ధమైన చర్య అని నోటీసుల్లో పేర్కొన్నారు. అంతేకాదు, గ్రామ కంఠం నిబంధనలకు ఇది విరుద్ధమని.. వెంటనే చర్చి విస్తరణ పనులు ఆపేయాలని ఆదేశించారు.

ఇదిలావుంటే, మతమార్పిడులకు వ్యతిరేంగా ఐదు తీర్మానాలు చేసిన గురజాల గ్రామస్తులపై ‘లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్’ హర్షం వ్యక్తం చేసింది. గురజాల గ్రామస్తులతో కలిసి ఈ సమస్యను త్వరలోనే చెక్ పెడతామని.. అందుకోసం పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని.. వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని LRPF ట్వీట్ చేసింది.

2011 జనాభా లెక్కల ప్రకారం గురజాల గ్రామంలోనే కాదు.. మొత్తం నందవరం మండలంలో క్రిస్టియన్ల సంఖ్య 59. అయినా, విదేశీ నిధులతో అక్కడ చర్చిని నిర్మించారు. పైగా గ్రామపంచాయితీ స్థలంలోనే అనుమతులు ఎలాంటి అనుమతులు లేకుండా చర్చిని నిర్మించినట్టు లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ తెలిపింది. పైగా అక్రమ చర్చిని తొలగించాలని గ్రామస్తులు పోరాటం చేస్తుంటే.. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుుల పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. గురజాల గ్రామస్తులు తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన LRPF.. త్వరలోనే మిగతా గ్రామాల్లో ఇలాంటి తీర్మానాలను అమలు చేస్తాయని తెలిపింది. ప్రజాస్వామ్యంలో ప్రజాశక్తిపై తమకు అపారమైన నమ్మకం వుందని స్పష్టం చేసింది.

ఒక్క గురజాల గ్రామంలోనే కాదు.. ఏపీలో కొన్ని వందల గ్రామాలు క్రిస్టియన్ మిషనరీల విషపు కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకూ మతమార్పిడులు పెరిగిపోతున్నాయి. తాజాగా ఏపీలో దళితులే లక్ష్యంగా జరుగుతున్న బలవంతపు మత మార్పిడులపై.. జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని.. ఏపీ ప్రధాన కార్యదర్శికి నోటీసులు కూడా జారీచేసింది.

క్రిస్టియన్ మిషనరీలు, చర్చిల ద్వారా జరుగుతున్న బలవంతపు మతమార్పిడులపై.. గతేడాది జనవరిలో ‘లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్’.. జాతీయ ఎస్సీ కమిషన్‎కు ఫిర్యాదు చేసింది. ఏపీలో చర్చిలు ముఖ్యంగా దళితులను టార్గెట్ చేస్తున్నాయని లేఖలో పేర్కొంది. తద్వారా దళితలకు దక్కాల్సిన రిజర్వేషన్లు దుర్వినియోగమవుతున్నాయని.. దీనిపై సత్వరం చర్యలు తీసుకునేందుకు వెంటనే నిజ నిర్ధారణ కమిటీని నియమించాలని కోరింది.

అటు, LRPF డేటా ఆధారంగా తాజాగా ‘ఎస్సీ, ఎస్టీ రైట్స్ ఫోరమ్’.. ‘జాతీయ ఎస్సీ కమిషన్’కు లేఖ రాసింది. వెంటనే చర్యలు చేపట్టాలని కోరింది. సత్వరమే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని నియమించాలని సూచించింది.

అంతేకాదు, పెద్దయెత్తున జరుగుతున్న బలవంతపు మతమార్పిడులు.. సామాజిక ఘర్షణలకు దారితీస్తున్నాయని.. గ్రామాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని.. కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని లేఖలో పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి ఎస్సీ అంటేనే క్రిస్టియన్ అనేలా మారిపోయిందని తెలిపింది.

గతంలో టీడీపీ అధికారంలో వున్నప్పుడు ‘చంద్రన్న క్రిస్టియన్ కానుక’ పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చింది. కేవలం క్రిస్టియన్ల కోసం తీసుకొచ్చిన ఈ పథకం ఇది. అయితే, ఈ పథకం కింద.. మతం మారిన ఎస్సీలను కూడా లబ్దిదారులుగా గుర్తించడం అప్పట్లో వివాదాస్పదమైంది. సమాచార హక్కు చట్టం కింద నమోదైన ఓ ఫిర్యాదుతో ఈ ఉదంతం వెలుగుచూసింది. లేఖలో ఈ విషయాన్ని కూడా ప్రస్తావించిన ఎస్సీ, ఎస్టీ రైట్స్ ఫోరమ్.. నిజమైన దళితులు అన్యాయానికి గురవుతున్న విషయాన్ని గుర్తుచేసింది.

గతంలో ‘వాట్ హ్యాపెండ్ టు క్రిస్టియన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో ‘సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్’ అనే సంస్థ ఓ నివేదిక ప్రచురించింది. ఈ నివేదికను ఉటంకించిన ఎస్సీ, ఎస్టీ రైట్స్ ఫోరమ్.. రాష్ట్రంలో క్రైస్తవు జనాభా డేటాలోని క్రమరాహిత్యాన్ని ఎత్తిచూపింది. సదరు నివేదిక ప్రకారం.. 1971 – 2011 మధ్యకాలంలో క్రైస్తవులుగా ప్రకటించుకున్నవారి సంఖ్య.. అధికారిక గణాంకాల ప్రకారం గణనీయంగా తగ్గింది. కానీ, వాస్తవం మాత్రం వేరుగా వుంది. నిజానికి, 1971 – 2011 మధ్యకాలంలో మతమార్పిడులు చాలా ఎక్కువగా జరిగాయి. అయితే, వారు మతం మారినప్పటికీ.. ప్రభుత్వ లెక్కల్లో మాత్రం హిందువులుగానే చెలామణి అవుతున్నారు. ఓవైపు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తూనే.. మరోవైపు హిందూ క్యాస్ట్ సర్టిఫికెట్స్‎తో అక్రమంగా రిజర్వేషన్లు పొందుతున్నారు. తద్వారా నిజమైన దళితులు అన్యాయానికి గురవుతున్నారు. ఈ విషయాన్ని కూడా ఎస్సీ, ఎస్టీ రైట్స్ ఫోరమ్ లేఖలో ప్రస్తావించింది. అంతేకాదు, క్రిస్టియన్ మిషనరీలు మతమార్పిడుల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయని తెలిపింది. దళితులను మత వేర్పాటువాదం వైపు ప్రేరేపిస్తున్నారని పేర్కొంది.

ఎస్సీ, ఎస్టీ రైట్స్ ఫోరమ్ లేఖను పరిగణలోకి తీసుకున్న జాతీయ ఎస్సీ కమిషన్ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. మతమార్పిడులపై తీసుకుంటున్న చర్యలపై 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని కోరింది.

ఏపీ ఇప్పుడు మతమార్పిడులకు చిరునామాగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. దళితులను టార్గెట్ చేస్తున్న క్రిస్టియన్ మిషనరీలు ఇబ్బడిముబ్బడిగా మతమార్పిడులకు పాల్పడుతున్నాయి. హిందూ కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్నాయి. ఎన్జీవోల మాటున విదేశాల నుంచి ఇబ్బడిముబ్బడిగా వస్తున్న అక్రమ నిధులను ఎరగా వేసి.. బలవంతపు మతమార్పిడులకు పాల్పడుతున్నారు. ఆర్థిక భరోసా అనే భ్రమను కల్పిస్తూ.. అమాయక దళితులను హిందూ మతానికి దూరం చేస్తున్నారు. అంతేకాదు, మతం మారినవారు కూడా ఎస్సీ రిజర్వేషన్లు పొందుతుండటంతో.. నిజమైన దళితులు రిజర్వేషన్లను కోల్పోతున్నారు. విద్యా, ఉద్యోగ అవకాశాలను చేజార్చుకోవాల్సి వస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు తర్వాత అత్యధికంగా మతమార్పిడులు జరగుతున్నది ఏపీలోనేనని గణాంకాలు చెబుతున్నాయి. జనగ్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతమార్పిడులు మరింత జోరుగా సాగుతున్నాయి.

ఇలాంటి బలవంతపు మతమార్పిడులకు అడ్డుకట్ట పడాలంటే, దేశంలోని ప్రతి గ్రామం గురజాలను ఆదర్శంగా తీసుకోవాలి. మతమార్పిడులపై తిరుగుబావుటా ఎగురవేసిన గురజాల గ్రామంపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రతి గ్రామం గురజాల అడుగుజాడల్లో నడిస్తే.. దేశంలో క్రైస్తవ మిషనరీల ఆగడాలకు తెరపడుతుంది. విదేశీ సంస్థలు విసిరే ఎంగిలి మెతుకులకోసం ఆరాటపడే పాస్టర్లకు వణుకుపుడుతుంది. అంతేకాదు, దేశంలో ఎలాంటి మత విద్వేషాలు తగ్గుముఖం పడతాయి. దళితుల హక్కులు రక్షించబడతాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here