ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో దుండగులు 15 జూలై 2022 శుక్రవారం ఉదయం మసీదులోకి ప్రవేశించి, ప్రార్థనలు చేయడానికి అక్కడికి వచ్చిన ఓ వృద్ధుడిని దారుణంగా హత్య చేశారు. బురఖా వేసుకున్న హంతకులు మసీదులోకి ప్రవేశించి, మసీదు ఆవరణలో కాల్పులు జరిపారు. పాత కక్షల కారణంగానే హత్య జరిగినట్లు చెబుతున్నారు.
అమర్ ఉజాలా కథనం ప్రకారం.. బులంద్‌షహర్‌లోని ఖుర్జానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్ పెయిన్ మొహల్లా ప్రాంతంలో ఇద్రిస్ నివసిస్తూ ఉన్నాడు. ఇద్రీస్ వయసు 65 సంవత్సరాలు. అదే ప్రాంతంలో నివాసముంటున్న కొందరితో ఇద్రీస్‌కు గతంలో వివాదం నడిచింది. ఆ వ్యక్తులపై ఇద్రీస్ కూడా కేసు నమోదు చేశాడు. శుక్రవారం, జూలై 15, ఉదయం 5 గంటలకు, ఇద్రిస్ మసీదుకు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఆ సమయంలో మరో ఐదు నుండి ఆరు మంది కూడా మసీదు వద్దకు వచ్చారు. అందులో ఒకరు ఇద్రిస్‌పై కాల్పులు జరిపి చంపారు.
ఒక బుల్లెట్ ఇద్రిస్ ఛాతీకి, మరొకటి అతని కుడి చేతికి తగిలింది. మసీదులో పడిపోయిన ఇద్రిస్‌కు చాలా రక్తం పోయింది. కాల్పుల శబ్దం విని మసీదులో ఉన్న వారంతా పారిపోయారు. ఇద్రిస్ బులంద్‌షహర్‌లో ఇనుము, ఉక్కు వ్యాపారం చేస్తూ ఉండేవాడు. పాత కక్షల కారణంగానే తన తండ్రిని హత్య చేశారని ఇద్రీస్ కుమారుడు ఆస్ మహ్మద్ ఆరోపించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. హత్య విషయం తెలిసిన వెంటనే బులంద్‌షహర్ జిల్లా మేజిస్ట్రేట్ చంద్ర ప్రకాశ్ సింగ్, ఎస్‌ఎస్పీ శ్లోక్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. పాత కక్షల కారణంగానే హత్య జరిగిందని ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు. తదుపరి విచారణ కోసం మసీదు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు పోలీసులు.