ఏపీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమ గ్రామాలను వెంటనే తెలంగాణలో కలపాలని కోరుతూ ఏపీకి చెందిన ఐదు గ్రామాల ప్రజలు ఆదివారం నిరసనలు వ్యక్తం చేశారు. గుండాల, పురుషోత్తపట్నం, యటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామాలకు చెందిన ప్రజలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వైద్య, విద్యా, వ్యాపారం ఇలా అన్ని విధాల తెలంగాణ రాష్ట్రం అనుకూలంగా ఉందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన సమయంలో తమ గ్రామాలను ఏపీలో కలిపారని, అప్పటి నుంచి తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో కలిసిన తమ గ్రామాలను తిరిగి భద్రాచలంలో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జగన్ ప్రభుత్వంపై నమ్మకం లేకనే విలీన గ్రామాల్లో ప్రజలు ఆందోళన చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందన్నారు. ఇప్పటికీ తాగేందుకు నీరు లేదని, విద్యుత్తు సరఫరా అనేక చోట్ల పునరుద్ధరణ జరగలేదని చంద్రబాబు ఆరోపించారు. విలీన మండలాల్లో దాదాపు 14 రోజుల నుంచి విద్యుత్తు లేదని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చంద్రబాబు అన్నారు. విలీన మండలాల్లో బాధితులకు ఇప్పటి వరకూ సాయం అందలేదన్నారు. అందుకే విలీన మండలాల్లోని ప్రజలు తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. అక్కడ ప్రజలు పడుతున్న అవస్థలను తెలుసుకోవాలని, వారి సమస్యలను పరిష్కరించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.