2024లో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు: గులాం నబీ ఆజాద్

0
762

ప్రస్తుత పరిస్థితుల ప్రకారం 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 300 సీట్లు వచ్చే అవకాశం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. డిసెంబరు 1న జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘాటి ప్రాంతంలోని కృష్ణ చందర్ పార్క్‌లో జరిగిన కార్యక్రమంలో ఆజాద్ ప్రసంగించారు. 2024లో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సాధించి 300 మంది ఎంపీలతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు కనిపించడం లేదని అన్నారు. కాంగ్రెస్ గెలువాలని కోరుకుంటున్నారని.. కానీ, 300 మంది సీట్లను గెలిచే లక్ష్యాన్ని కాంగ్రెస్ సాధిస్తుందని అనుకోవడం లేదని అన్నారు. ఇప్పుడు అయితే తనకు ఆ పరిస్థితులు కనిపించడం లేదని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దు గురించి పార్లమెంటులో మాట్లాడటం లేదని కొందరు అనుకుంటున్నారని, కానీ, ఏళ్లపాటు పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తింది తానేనని, మరెవరూ దీనిపై మాట్లాడలేదని గులాం నబీ ఆజాద్ అన్నారు. కానీ, ఈ అంశం ఎప్పుడైతే సుప్రీంకోర్టు ముందుకు వెళ్లిందో అప్పటి నుంచే తాను ఏమీ మాట్లాడటం లేదని వివరించారు. ఎందుకంటే తన చేతుల్లో లేని విషయాల గురించి మాట్లాడి ప్రజలను మభ్య పెట్టడం తనకు ఇష్టం లేదని అన్నారు.

నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసినందున, దానిని పునరుద్ధరించలేదని ఆజాద్ అన్నారు. కాబట్టి 2024లో పార్లమెంటు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో వేచి చూడడమే అంతిమంగా మనం చేయగలిగిందని.. అయితే కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆజాద్ అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సీఎం పదవి అనేది తన దృష్టిలో విలువలేనిదని గులాం నబీ ఆజాద్ అన్నారు. ఇప్పుడు కశ్మీరీల ముందు ఉన్నది భూమి, ఉద్యోగాల అంశమేనని వివరించారు. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న 370 రద్దు గురించి తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియదని.. కానీ అప్పటి కశ్మీరీల భూమి, ఉద్యోగాలు ఇతరులకు వెళ్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదనీ అన్నారు. ఇప్పుడు కేవలం సుప్రీంకోర్టు మాత్రమే 370 ఆర్టికల్‌పై నిర్ణయం తీసుకోగలదని, అది మినహాయిస్తే మళ్లీ అధికారంలోని ప్రభుత్వానికే ఆ అధికారం ఉన్నదని తెలిపారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వమే దాన్ని రద్దు చేసినప్పడు మళ్లీ ఎందుకు పునరుద్ధరిస్తుందని ప్రశ్నించారు.

పూంచ్ మరియు రాజౌరీలలో పర్యటిస్తూ ఆజాద్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఆజాద్ కాంగ్రెస్ లోని G-23లో ప్రముఖ సభ్యుడు. కాంగ్రెస్ పార్టీపై ఆయన అసంతృప్తిని వెళ్ల గక్కుతూనే ఉన్నారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ నుంచి సోనియా గాంధీ ఆయనను తప్పించారు.