గుజరాత్లో తొలిదశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అన్నివర్గాల ప్రజలు ఓటుహక్కును వినియోగించేందుకు ఉత్సాహం చూపించారు. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు కూడా కుటుంబసభ్యులతో వచ్చి ఓటువేశారు. సాయంత్రం 5 గంటల వరకూ సుమారు 60 శాతం పోలింగ్ నమోదయ్యింది. వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు కూడా చాలావరకు ఉదయాన్నే పోలింగ్‌కేంద్రానికి వెళ్లి ఓటువేశారు. మాజీ సీఎం విజయ్ రూపానీ , క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా రాజ్‌కోట్‌లో ఓటు వేశారు. ఇంకా వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు రాజ్‌కోట్ యువరాజు దంపతులు వింటేజ్కారులో వెళ్లి ఓటు వేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్.. సూరత్‌లో ఓటుహక్కు వినియోగించుకున్నారు.
సౌరాష్ట్ర-కచ్ రీజియన్, దక్షిణ ప్రాంతంలోని 19జిల్లాల పరిధిలోని 89స్థానాలకు.. ఓటింగ్ పూర్తైంది. 2.39కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వారి కోసం 14,382 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 89మోడల్, 89 పర్యావరణహిత పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. గుజరాత్లో ఎప్పుడు ద్విముఖ పోటీ ఉండగా.. ఈసారి ఆప్ ప్రవేశంతో త్రిముఖ పోటీ నెలకొంది. 27ఏళ్లుగా గుజరాత్లో అధికారంలో ఉన్న BJP వరుసగా ఏడోసారి పట్టు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఈసారి కూడా అధికారం BJP వశమైతే పశ్చిమ బంగాల్లో వామపక్ష కూటమి పేరిట ఉన్న రికార్డ్‌ను చేరుకుంటుంది. బంగాల్లో వామపక్ష కూటమి వరుసగా ఏడుసార్లు గెలిచి.. 2011వరకు అధికారంలో కొనసాగింది.