మరో సారి సంచలనానికి తెరలేపిన బీజేపీ.. ఆయనే గుజరాత్ ముఖ్యమంత్రి

భారతీయ జనతా పార్టీ మరోసారి సంచలనానికి తెరలేపింది. గుజరాత్ నూతన ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ను బీజేపీ అధిష్టానం ఎంపికచేసింది. గాంధీనగర్‌లో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా భూపేంద్ర పటేల్‌ను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. భూపేంద్ర పటేల్ పేరును మాజీ సీఎం విజయ్ రూపానీ ప్రతిపాదించగా మిగతా ఎమ్మెల్యేలంతా ఆమోదించారు. కేంద్ర పరిశీలకుడు నరేంద్రసింగ్ తోమర్ భూపేంద్ర పటేల్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన భూపేంద్ర పటేల్ ప్రస్తుతం ఘట్లోడియా నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మృదువుగా మాట్లాడే, మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్ర పటేల్ ను ఆదివారం నాడు విజయ్ రూపానీ వారసుడిగా పదవిని కైవసం చేసుకున్నారు. న్యూఢిల్లీ నుండి వచ్చిన నేతలతో పాటూ విజయ్ రూపానీ భూపేంద్ర పేరును ప్రతిపాదించారు, దీనిని కేంద్ర పార్టీ పరిశీలకుల సమక్షంలో ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ కూడా సమర్థించారు. 59 సంవత్సరాల భూపేంద్ర పటేల్ గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కు ఆప్తుడు. ముఖ్యమంత్రి రేసులో ఎంతో మంది అగ్రనేతలను కాదని భూపేంద్ర పటేల్ ను బీజేపీ అధిష్టానం ఎన్నుకుంది. డిసెంబర్ 2022 లో జరగబోయే కీలకమైన అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపీకి ఆయనే నాయకత్వం వహిస్తాడు.
అహ్మదాబాద్‌లోని ఘట్లోడియా నియోజకవర్గం నుంచి ఆనందీబెన్ 2017 లో సీటును ఖాళీ చేసిన తర్వాత భూపేంద్ర పటేల్ కు అక్కడి ఎమ్మెల్యేగా అవకాశం దక్కింది. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రిగా అయ్యారు. ఆదివారం సాయంత్రం గవర్నర్ ఆచార్య దేవవ్రత్ని కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 111 మంది బీజేపీ శాసనసభ్యులు అహ్మదాబాద్-గాంధీనగర్ హైవేలోని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో తమ నాయకుడిగా భూపేంద్ర పటేల్ ను ఎన్నుకున్న తర్వాత ఆయన గవర్నర్ వద్దకు వెళ్లారు. ఆయన సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జ్యోతిష్యులు సూచించినట్లుగా మధ్యాహ్నం 2.20 గంటలకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పొందిన భూపేంద్ర పటేల్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే రెండు రోజుల్లో కొత్త మంత్రుల మండలి ప్రకటించబడుతుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సి.ఆర్. పాటిల్ అన్నారు. అధికార యంత్రాంగం మరియు పోలీసు విభాగాల్లో త్వరలో పెద్ద మార్పు ఉంటుంది.