పెళ్లిళ్లకు వెళ్ళడానికి ముఖ్య కారణం.. అక్కడ పెట్టే భోజనం కూడా..! మంచి మంచి వంటకాలను రుచి చూడొచ్చని అనుకుంటూ ఉంటాం. అదే పెళ్లి మండపంలో అగ్నిప్రమాదం జరిగితే ఎక్కడికైనా వెళ్లిపోవాలని ప్రయత్నిస్తాం.. బయట పడితే చాలు భగవంతుడా అని భావిస్తాం. కానీ కొందరు మాత్రం ఓ వైపు అగ్ని ప్రమాదం జరుగుతూ ఉంటే.. మరో వైపు పెళ్లి భోజనం చేయడానికే మొగ్గు చూపించారు.
భివాండిలో జరిగిన ఒక వివాహానికి సంబంధించిన వీడియోలో.. అక్కడ మంటలు చెలరేగుతుండగా, కొందరు అతిథులు మాత్రం తన ఆహారాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. ఓ వ్యక్తి మరీనూ.. వెనుక సినిమా సీన్లలో కనిపించే విధంగా పెద్ద ఎత్తున అగ్ని కనిపిస్తున్నా.. టేబుల్ మీద ఆహారాన్ని తింటూ ఉన్నాడు. ఆ మనిషి తన చుట్టూ తిరిగి, అగ్నిని చూస్తూ, ఏమీ జరగనట్లుగానే తన ఆహారాన్ని తింటూనే ఉన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. వీడియో ఓ వైపు భయాన్ని కలిగిస్తూ ఉండగా.. మరో వైపు నవ్వు కూడా తెప్పిస్తూ ఉంది. ప్రమాద తీవ్రత మరింత పెరిగి.. పొగ దట్టంగా వ్యాపిస్తే ప్రమాదం మరింత తీవ్రం అవుతుంది. భోజనాన్ని వేస్ట్ చేయకూడదు అనే సిద్ధాంతాన్ని ఈ వ్యక్తి పాటిస్తూ ఉన్నాడని నెటిజన్లు చెప్పుకొచ్చారు.
థానేలోని భివాండిలోని అన్సారీ మ్యారేజ్ హాల్‌లో ఆదివారం సాయంత్రం ఈ మంటలు చెలరేగాయి. అతిథులు, భారీ అగ్నిప్రమాదాన్ని గమనించిన తర్వాత కూడా, నిర్మొహమాటంగా తమ సంభాషణలను కొనసాగిస్తూ, ఆహారాన్ని ఆస్వాదించారు. ఫ్రీ ప్రెస్ జర్నల్ కథనం ప్రకారం, మహారాష్ట్రలోని కళ్యాణ మండపంలోని స్టోర్‌రూమ్‌లో మంటలు చెలరేగాయి. మంటల్లో ఆ ప్రాంతంలో పార్క్ చేసిన ఆరు ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రాత్రి 10 గంటల సమయంలో ఘటన గురించి అప్రమత్తం కావడంతో మూడు అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో రాత్రి 11 గంటలకు మంటలు అదుపులోకి వచ్చినట్లు భివాండి మున్సిపల్ కార్పొరేషన్ అధికారి తెలిపారు. మంటలు చెలరేగిన గదిలో అలంకరణ కోసం ఉపయోగించే వస్తువులతో పాటు కుర్చీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగడానికి ఖచ్చితమైన కారణం ఏమిటో తెలుసుకోలేకపోయారు.