Special Stories

తాలిబన్ కేబినెట్‎పై అమెరికా అయోమయం..!

అమెరికా నిఘా సంస్థ FBI మోస్ట్ వాంటెడ్ లిస్ట్‎లోని ఫొటో ఇది. మూడు విభిన్న కోణాల్లో చిత్రీకరించిన ఈ మూడు ఫొటోల్లో వున్నది.. ఓ కరుడుగట్టిన ఉగ్రవాది. అతని పేరు సిరాజుద్దీన్ హక్కానీ. ఫొటో కింద అతని మారుపేర్లతో పాటు.. పుట్టుపూర్వోత్తరాలు కూడా వున్నాయి. ఈ ఫొటోను క్లోజ్‎గా పరిశీస్తే.. రివార్డ్ పేరుతో మీకో డిస్క్రిప్షన్ కూడా కనిపిస్తుంది. ఇతనికి సంబంధించి మీకు ఎలాంటి సమాచారం తెలిసినా.. స్థానిక FBI కార్యాలయాన్ని లేదా అమెరికన్ ఎంబసీని సంప్రదించాలని.. కనీసం కాన్సులేట్‎కైనా తెలియజేయాలన్నది ఆ విజ్ఞప్తి. అలా చేస్తే ఏకంగా మీకే దక్కే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..? అక్షరాలా 10 మిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు 74 కోట్లు. అప్పట్లో సిరాజుద్దీన్ తలకు FBI కట్టిన వెల ఇది.

కట్ చేస్తే, ప్రస్తుతం సిరాజుద్దీన్ హక్కానీ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆఫ్ఘన్లకైతే ఇంకా బాగా తెలుసు. వాళ్లు అతన్ని చూశారు కూడా. ఎందుకంటే, ఇప్పుడు అతను వున్నది ఆప్ఘన్ల రాజధాని కాబూల్‎లోనే. విచిత్రమేమిటంటే, సిరాజుద్దీన్ ఆచూకీ తెలిసినా.. అతన్ని పట్టించలేని పరిస్థితి వాళ్లది. FBIకి సమాచారం ఇద్దామంటే ఇప్పుడక్కడ అమెరికా ఎంబసీ లేదాయె. కనీసం కాన్సులేట్ కూడా లేకపాయె. సిరాజుద్దీన్ గురించి FBI ఇచ్చిన మోస్ట్ వాంటెడ్ పోస్ట్ ఓ జోక్‎గా మారిపోయింది. సిరాజుద్దీన్ కరుడుగట్టిన ఉగ్రవాది అని.. అతనితో చాలా ప్రమాదమని ప్రకటించిన.. FBI ప్రకటనకు విలువ లేకుండా పోయింది. అయినా, ఇప్పుడతన్ని ఎవరు పట్టిస్తారు..? ఎవరు సమాచారం అందిస్తారు..? ఆఫ్ఘన్లు అంతటి సాహసం చేయగలరా..? అది అసాధ్యం. ఎందుకంటే, 4 కోట్ల ఆఫ్ఘన్ ప్రజలకు ఇప్పుడతను రక్షకుడు. సిరాజుద్దీన్ హక్కానీ.. ఆప్ఘనిస్తాన్ న్యూ హోంమినిస్టర్. మరి, తమ దేశ హోంమంత్రిని ఎవరైనా పట్టిస్తారా చెప్పండి..?

ఇదిలావుంచుదాం.. అమెరికాతో పాటు.. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి మోస్ట్ వాంటెడ్ లిస్ట్‎లో కూడా పేరుంది. మరి, ఈ రెండు సంస్థలు ఇంకా అతన్ని మోస్ట్ వాంటెడ్‎గానే చూస్తాయా..? లేక, ఆప్ఘన్ హోంత్రిగా గుర్తిస్తాయా..? ఈ తాలిబన్ మినిస్టర్‎తో అమెరికా, ఐక్యరాజ్యసమితి కలిసి పనిచేస్తాయా..? ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న ఇది. ఇదే ప్రశ్న వేసిన ఓ జర్నలిస్ట్‎కు.. ఐక్యరాజ్య సమితి అధికార ప్రతినిధి ఏ సమాధానం చెప్పాడో తెలుసా..? ఐక్యరాజ్య సమితి దేశాల ప్రభుత్వాలకు గుర్తింపు ఇవ్వదని.. ఆ విషయం ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు చూసుకుంటాయని మాట దాటవేశారు. ఇక, మోస్ట్ వాంటెడ్ లిస్ట్ విషయానికి వస్తే.. అది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చూసుకుంటుందని.. పరిస్థితులను బట్టి లిస్ట్‎లో మార్పులు చేర్పులు జరుగుతాయని చేతులు దులుపుకున్నారు. అంటే, సెక్యూరిటీ కౌన్సిల్‎లోని సభ్యదేశాలు.. అవసరమైతే సిరాజుద్దీన్ పేరును మోస్ట్ వాంటెడ్ లిస్ట్ నుంచి తొలగించుకోవచ్చన్నమాట..! మరి, సభ్యదేశాలు ఆ పని చేస్తాయా..? తాలిబన్లకు కొమ్ముకాస్తున్న చైనా ఆ పని చేయగలుగుతుందా..? మరి, అలాంటప్పుడు సెక్యూరిటీ కౌన్సిల్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్‎కు విలువేముంది..? FBI మోస్ట్ వాంటెడ్ లిస్ట్‎లో వున్న సిరాజుద్దీన్‎తో ఎలా అమెరికా దౌత్యం నెరపుతుందా..? ఇతర దేశాల మంత్రులకు చేసినట్టే.. దౌత్య మర్యాదలు చేస్తుందా..? ద్వైపాక్షిక చర్చలు జరుపుతుందా..? చర్చలకు వస్తే.. ప్రొటోకాల్ ప్రకారం రెడ్ కార్పెట్ పరుస్తుందా..? అదే జరిగితే, అమెరికా పరువేంగాను..? అగ్రరాజ్యం తనను తాను దిగజార్చుకున్నట్టే కదా..!

అమెరికా డైలమా ఒక్క సిరాజ్ విషయంలోనే కాదు.. 33 మంది కొత్త తాలిబన్ మంత్రుల్లో 17 మంది FBI మోస్ట్ వాంటెడ్ లిస్ట్‎లో వున్నవారే. ప్రస్తుతం వీరంతా ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్ష భవనంలో రాచరికం ఒలకబోస్తున్నారు. ఆఫ్ఘనీ చాప్‎లు, కాబూలీ పులావ్‎లు తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి, అమెరికా వీరిని మంత్రులుగా గుర్తిస్తుందా..? లేక ఎప్పటిలా టెర్రరిస్టులుగానే చూస్తుందా..? ఉంటే వీరంతా.. మోస్ట్ వాంటెడ్ లిస్ట్‎లోనైనా వుండాలి..? లేదా అమెరికా గెస్ట్ లిస్టులోనైనా వుండాలి. కానీ, ఈ రెండు లిస్టుల్లో ఎలా మెంటైన్ చేయడం కుదరని పని. ఇదే ఇప్పుడు అమెరికా ముందున్న సవాల్. ఈ తాలిబన్ల ఏరివేత కోసమే కదా.. 20 ఏళ్లుగా అమెరికా, నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్‎లో తిష్టవేసింది..! ఈ తాలిబన్ల కోసమే కదా అమెరికా వందల కోట్ల డాలర్లు ఖర్చుచేసింది..! మరి, అలాంటి తాలిబన్ మంత్రులతో అమెరికా ఎలా వ్యవహరిస్తుందో చూడాలి..!

Related Articles

Leave a Reply

Your email address will not be published.

ten + seven =

Back to top button