National

17న జీఎస్టీ మండలి ప్రత్యక్ష సమావేశం.. పెట్రోలు, డీజిల్‌పై చర్చ జరిపే అవకాశం..!

భారతదేశంలో పెట్రోల్-డీజిల్ ధరలకు కళ్లెం వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఓ వైపు ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇలాంటి సమయంలో సెప్టెంబర్ 17న జీఎస్టీ మండలి ప్రత్యక్ష సమావేశం జరుగుతూ ఉండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో పెట్రోలు, డీజిల్ ధరలపై చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. జీఎస్టీ మండలి దాదాపు 20 నెలల తర్వాత ఈ నెల 17న ప్రత్యక్షంగా సమావేశం కాబోతోంది. 18 డిసెంబరు 2019 తర్వాతి నుంచి ఆన్‌లైన్‌లోనే ఈ సమావేశాలు జరుగుతుండగా, ఇప్పుడు తొలిసారి మండలి ప్రత్యక్షంగా సమావేశం కాబోతోంది. పెట్రోలు, డీజిల్‌తోపాటు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయంలో కొంత కోల్పోవాల్సి వస్తుంది. ఇందుకు అవి అంగీకరిస్తేనే పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే వీలుంటుంది. ప్రభుత్వాలకు ఆదాయం తగ్గినప్పటికీ ప్రజలకు మాత్రం ప్రయోజనం చేకూరుతుంది. పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై జీఎస్టీ మండలి చర్చించి నిర్ణయం తీసుకోవాలని కేరళ హైకోర్టు జూన్‌లోనే మండలికి సూచించింది.

కేంద్ర మరియు రాష్ట్ర ఆర్థిక మంత్రులతో కూడిన కౌన్సిల్ శుక్రవారం లక్నోలో సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో రికార్డు స్థాయిలో ఉన్న పెట్రోల్ మరియు డీజిల్ రేట్ల సమస్యకు జీఎస్టీ ఒక పరిష్కారంగా భావించబడుతోంది. జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంటుందా అని కూడా ప్రజలు ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. కేంద్ర సుంకంతో సహా వ్యాట్‌ రూపంలో పెట్రోల్‌, డీజిల్‌పై ప్రస్తుతం రిటైల్‌ విక్రయ ధరలో 50 శాతం పన్నులే ఉంటున్నాయి. ఒకవేళ వీటిని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తే గరిష్ఠ పన్ను 28 శాతంతో సహా ఫిక్స్‌డ్‌ సర్‌ఛార్జి ఉండే అవకాశముంది. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కొంత తగ్గుతాయి. కేంద్రం ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌పై రూ.32.80, డీజిల్‌పై రూ.31.80 సుంకం విధిస్తోంది. ఈ పన్ను మొత్తం కేంద్ర ఖాతాలోకే వెళుతోంది. జీఎస్టీ పరిధిలోకి వస్తే రాష్ట్రాలు, కేంద్రం మధ్య 50-50 నిష్పత్తిలో ఆదాయాలు పంచుకోవాల్సి ఉంటుంది. జీఎస్టీ పై మంత్రుల కమిటీలో నాలుగవ వంతు సభ్యుల ఆమోదం అవసరం. కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇది ఆయా రాష్ట్రాల ప్రధాన ఆదాయ వనరులను కేంద్రం నియంత్రణలోకి తెస్తుంది.

పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం దాదాపు లక్ష కోట్ల రూపాయలు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ఈ మొత్తం GDP లో 0.4% కి సమానంగా ఉంటుంది. పెట్రోల్, డీజిల్‌ని జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే మహారాష్ట్ర ఆదాయం రూ .10,424 కోట్లు తగ్గవచ్చు. రాజస్థాన్ ఆదాయం రూ .6,388 కోట్లు, మధ్యప్రదేశ్ ఆదాయం రూ .5,489 కోట్లు తగ్గవచ్చు. ఉత్తరప్రదేశ్ రూ .2,419 కోట్లు, హర్యానా 1,832 కోట్లు, పశ్చిమ బెంగాల్ 1,746 కోట్లు, బీహార్ రూ .672 కోట్లు ఎక్కువ పన్ను పొందవచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. పెట్రోల్-డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే, దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర రూ .75 కి తగ్గవచ్చు, డీజిల్ ధర లీటర్‌కు రూ .68 వరకు చేరవచ్చని అంటున్నారు.

కరోనా ఔషధాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వంటి వాటికి పన్ను మినహాయింపులు కొనసాగించే అంశంపైనా జీఎస్టీ మండలి సమావేశంలో చర్చిస్తారని సమాచారం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 − 2 =

Back to top button