National

పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై జీఎస్టీ మండలి ఏమి చెప్పిందంటే

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన లక్నోలో నిర్వహించిన 45వ జీఎస్టీ మండలి సమావేశం ముగిసింది. దాదాపు 20 నెలల తర్వాత ప్రత్యక్ష పద్ధతిలో ఈ సమావేశం చేపట్టారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మండలి ఆమోదం తెలిపింది. జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకొచ్చే అంశం మరోసారి వాయిదా పడింది. పెట్రో ఉత్పత్తులను తీసుకురావడానికి ఇది తగిన సమయం కాదని జీఎస్టీ మండలి అభిప్రాయపడిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని కేరళ హైకోర్టు సూచించిన నేపథ్యంలో సమావేశంలో దాన్నే అజెండాలో చేర్చి చర్చించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. సమావేశంలో సభ్యులు వ్యతిరేకించిన అంశాన్ని కోర్టుకు నివేదిస్తామని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు నిర్మలా సీతారామన్.

కండరాల క్షీణత ఔషధాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పించారు. రూ.16 కోట్ల విలువైన ఔషధాలకు మినహాయింపు వర్తించనుంది. కేంద్రం సూచించిన ఔషధాల దిగుమతిపై ఐసీఎస్టీ మినహాయింపు ఇచ్చారు. కరోనా సంబంధిత ఔషధాల ధరలపై జీఎస్టీ రాయితీలను డిసెంబరు 31 వరకు పొడిగించారు. క్యాన్సర్ ఔషధాలపై 12 శాతం నుంచి 5 శాతానికి జీఎస్టీ కుదించారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు సరఫరా చేసే బయో డీజిల్‌పై 12 శాతంగా ఉన్న జీఎస్టీని కూడా 5 శాతానికి తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. సరుకు రవాణా వాహనాలకు రాష్ట్రాలు విధించే నేషనల్ పర్మిట్ ఫీజులను జీఎస్టీ నుంచి మినహాయించినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అంతేగాక, స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ సేవలపై జీఎస్టీ వేస్తారంటూ వచ్చిన వార్తలపై కేంద్రమంత్రి స్పందించారు. వినియోగదారులపై ఎలాంటి పన్నూ వేయడం లేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అదే సమయంలో గతంలో సంబంధిత రెస్టారెంట్ జీఎస్టీ చెల్లించలేదని, ఇకపై స్విగ్గీ, జొమాటో వంటి అగ్రిగేటర్లు జీఎస్టీ చెల్లించాలని సీతారామన్ తెలిపారు. రైల్వే విడిభాగాలు, లోకోమోటివ్స్‌పై జీఎస్‌టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచారు. వికలాంగులు ఉపయోగించే వెహికల్స్‌పై జీఎస్‌టీని 5 శాతానికి కుదించారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ స్కీమ్స్ ద్వారా అందించే ఫోర్టిఫైడ్ రైస్‌ మీద జీఎస్‌టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ఓడలు, విమానాల ద్వారా చేసే ఎగుమతులపై మరో ఏడాది వరకు జీఎస్‌టీ ఉండదు. రాష్ట్రాలకు జీఎస్‌టీ పరిహారం చెల్లింపు 2022 జూన్ తర్వాత పొడిగింపునకు కేంద్రం అంగీకరించలేదు.

Related Articles

Back to top button