హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడిన కెప్టెన్ వరుణ్ సింగ్ ఇక లేరు..!

0
730

తమిళనాడు మిలటరీ హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడిన కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూశారు. బెంగలూరులోని కమాండ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు. లైఫ్ సపోర్ట్ సిస్టమ్ లో ఉన్న ఆయన ఆరోగ్యం విషమించడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వరుణ్ సింగ్ కోలుకోవాలని దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్రార్థనలు చేశారు. అయినా కూడా ఆయన మనకు దక్కలేదు. ఆయన ప్రాణాలతో బయట పడతారని దేశమంతా ఆకాంక్షించింది. కానీ చివరికి మింగుడు పడని చేదు వార్త వినాల్సి వచ్చింది.

ఈ నెల 8వ తేదీన తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కూప్పకూలిన ప్రమాదంలో 13 మంది మరణించిన సంగతి తెలిసిందే. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికతో పాటు 11 మంది మరణించారు. ఈ దుర్ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్కడు వరుణ్ సింగ్. ఐఎఎఫ్ వరుణ్ సింగ్ మరణాన్ని అధికారికంగా ప్రకటించింది. వరుణ్ సింగ్ మరణంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 14కి చేరింది. సుమారు వారం రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసిన వరుణ్ సింగ్ ఇవాళ ఉదయం ఆయన మరణించినట్టుగా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.